పండ్ల ఉత్సవాలపై ఓ లుక్కేసుకోండి..!

Sun,April 15, 2018 04:37 PM

National fruits festival

పండ్లు తింటేనే నిండైన జీవితం..ఈ మాట ఎవరన్నారో కానీ అక్షర సత్యం.. అదేంటి పండ్లు తినకపోతే ఏమైనా చచ్చిపోతామా? అనే సందేహం రావచ్చు.. ఇది అర్థం లేని ప్రశ్న అనుకోవచ్చు..కానీ తాజా పండ్లు తినకనే చాలామంది చనిపోతున్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు.. ఇక్కడ పండ్ల గురించి ఉపోద్ఘాతం ఎందుకనే కదా! ఈ జంటకమ్మలో మనం చేసేది పండ్ల ఉత్సవం.. భారతదేశం నలుమూలలా పండ్లకు కట్టిన పట్టం గురించే.. కాబట్టి నోరెళ్లబెట్టి చదువుతూ.. నోట్లో ఒక పండుని వేసుకోండి.. అటు ఆరోగాన్ని.. ఆనందాన్నీ పొందండి..
-సౌమ్య పలుస

అవరేకై మేళా


లాబ్లాలాబ్, హైసింథ్.. ఆఫ్రికాలో పండే బీన్స్ పేర్లు. కెన్యా, వియత్నాంల్లో కూడా బీన్స్ చాలా ఇష్టంగా తింటారు. బెంగళూరులో బీన్స్‌ని అవరేకై అంటారు. అక్కడి వాళ్లు ఇష్టంగా తినే కూరగాయ కూడా ఇదేనట. మనమైతే బీన్స్‌తో మూడు నాలుగు రకాలుగా కూరలు వండుకుంటాం. కానీ వివిధ రకాల వంటకాలతో అక్కడ ఉత్సవమే జరుగుతుంది. జనవరిలో బెంగళూరులోని వీవీ పురంలో అవరేకై మేళా జరుగుతుంది. ఇక్కడ పక్క గ్రామాల రైతులు బీన్స్ తీసుకొచ్చి ఈ మేళాలో అమ్ముతారు. అలాగే వీటితో రకరకాల వంటకాలను కూడా చేస్తారు. ఈ సంవత్సరం జనవరిలో కూడా ఈ మేళా జరిగింది. అప్పుడు 150 మంది వంటవాళ్లు 120 రకాల అవరేకై వంటకాలు చేసి మేళాను అదరగొట్టారు.

నేషనల్ బనానా ఫెస్టివల్అరటిపండ్లు ఎన్ని రకాలు? అదేం ప్రశ్న అనిపిస్తుంది కదా! మనకు తెలిసి ఇవి మూడు, నాలుగు రకాలు. కానీ 150 రకాల అరటి పండ్లు ఉన్నాయట. దీనికి సంబంధించి కేరళలో ఫిబ్రవరిలో నేషనల్ బనానా ఫెస్టివల్ జరుపుతారు. ఇందులో ముఖ్యంగా కా పూవర్, విటమిన్ ఏ పుష్కలంగా ఉండే పిసాంగ్ బెర్లిన్ ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయట. పైగా అరటి వంటి చెట్లను ఎలా పెంచాలి? టెక్నిక్స్‌తో పంటలు ఎలా పండించాలో అనే దానిమీద డాక్యుమెంటరీనీ ప్రదర్శిస్తారు. ఇంక ఈ ఫెస్టివల్‌లో అరటితో చేసే బోలెడు వంటకాలనూ రుచి చూడొచ్చు. అంతేకాదు.. కొన్ని స్టాల్స్‌ల్లో అరటిపండుతో చేసిన ఐటమ్స్ కూడా మనకు దర్శనమిస్తాయి.

పైనాపిల్ ఫెస్టివల్ఈశాన్య భారతదేశంలో పైనాపిల్‌ని బాగా ప్రేమిస్తారు. పైగా వీటి ఉత్పత్తిలో మణిపూర్ మొదటి స్థానంలో ఉంది. అందుకే అక్కడి వాళ్లు ప్రతీ సంవత్సరం ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో పైనాపిల్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తారు. అక్కడికి వచ్చిన వాళ్లు వివిధ సైజుల్లో ఉన్న పైనాపిల్స్‌ని వాళ్ల బుట్టల్లో నింపుకొని వెళతారు. పైగా ఈ ఫెస్ట్‌లో.. మణిపూర్‌లోని వివిధ రకాల వంటకాలను చేసి అక్కడ స్టాల్స్‌లో ఉంచుతారు. ప్రతీ యేడు ఈ ఫెస్ట్‌లో మిస్ పైనాపిల్ క్వీన్ కాంటెస్ట్ కూడా నిర్వహిస్తారు. మణిపూర్ వాసులు చాలా సరదాగా ఈ ఉత్సవం జరుపుతారు.

కొంకణ్ ఫ్రూట్ ఫెస్ట్గోవా రాజధాని పనాజీలో కొంకణ్ ఫ్రూట్ ఫెస్ట్ ఏప్రిల్‌లో జరుగుతుంది. ఈ ఉత్సవంలో అక్కడ ఎక్కువగా పండే పండ్లయిన బకుల్, అన్వాడే, కర్మల్, వెల్వెట్ ఆపిల్.. ఇలా వివిధ రకాల పండ్లు ప్రదర్శనకు ఉంచుతారు. ఈ ఫెస్ట్‌లో పండ్లు తినే కాంపిటీషన్ ఆద్యంతం అందరినీ నవ్విస్తుంది. మూడు రోజుల పాటు అక్కడ సంప్రదాయ నృత్యాలు సందర్శకులను అలరిస్తాయి. అలాగే వ్యవసాయ రంగానికి చెందిన వివిధ రకాల సూచనలు, సలహాలు కూడా ఇస్తుంటారు.

ఇంటర్నేషనల్ మ్యాంగో ఫెస్టివల్వేసవి కాలం వచ్చిందంటే మామిడి కాయలు నోరూరిస్తాయి. 500 రకాల వెరైటీలతో ఈ పండ్లు మురిపిస్తుంటాయి. అందుకే ఢిల్లీలో వేసవి కాలంలో రెండు రోజుల పాటు వీటిని ఒకచోట ప్రదర్శనకు ఉంచుతారు. పెద్ద ఉత్సవంలాగే ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఇక్కడ మామిడి పండ్లు తినడం, వాటి చెక్కు తీయడం లాంటి పోటీలూ పెడుతారు. మామిడికాయతో నోరూరించే వంటకాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. జామ్, జ్యూస్, పచ్చళ్ల వంటి వెరైటీలెన్నింటినో మ్యాంగో ఫెస్ట్‌కి వస్తే కొనుక్కోవచ్చు.

ప్రపంచ నారింజ ఉత్సవంనాగ్‌పూర్‌ని ఆరెంజ్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటారు. జ్యూసీ, సూపర్ ఫ్లేవర్ ఆరెంజ్ ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టపడే పండు. అయితే ఇంతకుముందు ఎప్పుడూ ఈ పండుగ నాగ్‌పూర్‌లో జరుగలేదు. 2017 డిసెంబర్ నుంచి ఈ ఆరెంజ్ ఫెస్టివల్ ఆరంభించారు. అయితే ఈ పండుగను ఒకచోటే జరుపరు. మూడు రోజుల పాటు నారింజ పండ్ల ఉత్సవం జరుగుతుంది. అక్కడ వంటకాలు, నారింజలతో బొమ్మలను చేయడం లాంటి పోటీలు నిర్వహిస్తారు. ఇక్కడి నుంచి దాదాపు 10 రాష్ర్టాలకు, విదేశాలకు ఈ నారింజలు దిగుమతి అవుతాయి.

జాక్‌ఫ్రూట్ ఫెస్టివల్జాక్‌ఫ్రూట్‌కి గోవా ప్రత్యేకమని చెప్పొచ్చు. ఇక్కడి వాళ్లు దీన్ని సంపన్న ఫలంగా అభివర్ణిస్తారు. సోక్రో అనే గ్రామంలో ఈ ఫెస్టివల్‌ని ప్రతీ యేడు నిర్వహిస్తారు. టూరిస్టులకు, అక్కడి జనాలకు ఇదో పెద్ద పండుగ. పనస పండుతో చేసిన రకరకాల వంటకాలు ఈ ఫెస్టివల్‌లో కొలువుదీరుతాయి. పనసతో పాపాడ్స్, సట్టం, స్వాష్స్‌లాంటి నోరూరించే వంటకాలు ఇక్కడ కనిపిస్తాయట. మాన్‌సూన్ సమయంలో ఈ ఫెస్టివల్ జరుగుతుంది.

కడలీకై పరిషే


ఇది బెంగళూరులో జరిగే పురాతన ఫెస్టివల్. కడలీకై అంటే పల్లీలు అని అర్థం. క్రీ.శ. 1537 నుంచి ఈ ఫెస్టివల్ జరుగుతున్నది. బెంగళూరులో సిటీ ఫౌండర్ అయిన కెంపెగౌడ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారట. కార్తీక మాసంలోని చివరి సోమవారం రోజు ఈ ఉత్సవం జరుగుతుంది. ఒక్క బెంగళూరే కాదు.. ఇతర రాష్ర్టాల నుంచి కూడా వివిధ రకాల పల్లీలను ఇక్కడ అమ్మకానికి తీసుకొస్తారు. దాదాపు వీటి ధర కేజీ 20 నుంచి 45 రూపాయలే ఉంటుంది. పల్లీలతో చేసే అనేక రకాల స్నాక్స్ ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

స్ట్రాబెరీ ఫెస్టివల్


స్ట్రాబెరీలను రాశిగా పోసి చూస్తే అబ్బా అనక మానరు. మహాబలేశ్వర్, పంచాగ్ని ప్రాంతాల్లో ఈ సాగు ఎక్కువగా చేస్తారు. అందుకే అక్కడ జామ్ బ్రాండ్ అయిన మాప్రో స్ట్రాబెరీ ఫెస్టివల్ నిర్వహిస్తుంది. ఈ రెండు స్థలాల్లో మార్చి లేదా ఏప్రిల్‌లో ఈ ఉత్సవం జరుగుతుంది. ఇక్కడే కాకుండా మేఘాలయలోని సోహ్లియా అనే ప్రాంతంలో కూడా స్ట్రాబెరీ సాగు జరుగుతుంది. అక్కడ ఫిబ్రవరిలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక్కడికెళితే.. స్ట్రాబెరీతో చేసిన వైన్, ఐస్‌క్రీమ్, జ్యూస్‌లను టేస్ట్ చేయవచ్చు.

చికో ఫెస్టివల్మహారాష్ట్రలో సపోటాలని ఎక్కువగా పండిస్తారు. గోల్వాడ్, ధాను జిల్లాల్లో వీటి ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. వీటితో వచ్చే ఆదాయం కూడా బాగానే ఉంటుంది. కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం ఈ చికో ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నది. ఇందులో స్పెషల్ ఏంటంటే.. చికో మారథాన్. అంతేకాదు.. ట్రెషర్ హాంట్స్, ట్రెడీషనల్ మీల్స్ ఇక్కడికి వచ్చినవాళ్లు ట్రై చేయాల్సిందే! ఇక్కడికి వెళితే ఆర్గానిక్ కంపోస్టింగ్ టెక్నికల్‌ను కూడా నేర్చుకోవచ్చు. అలాగే అక్కడ చేసే సపోటా సాగు గురించిన మెళకువలు కూడా నేర్పిస్తారు.

1688
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles