అచ్చూ మోదీలాగే ఉండే ఈ వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ వాది!

Thu,November 8, 2018 04:45 PM

Narendra Modi lookalike joined Congress in UP

న్యూఢిల్లీ: ఈ ఫొటోలోని వ్యక్తిని సడెన్‌గా చూస్తే మన ప్రధాని నరేంద్ర మోదీయే అనుకుంటాం. లుక్‌లోనే కాదు ఈయన ఆహార్యం, మాట్లాడే తీరు అన్నీ కూడా మోదీలాగే ఉంటాయి. ఈయన పేరు అభినందన్ పాఠక్. ఇన్నాళ్లూ ఈయన బీజేపీ మిత్రపక్షం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడిగా ఉండేవారు. కానీ గత నెలలోనే యూపీ కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. చత్తీస్‌గఢ్‌లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మోదీ హయాంలో అచ్చే దిన్ ఇక రావని అభినందన్ అంటున్నారు. నేను మోదీలాగా కనిపించేసరికి చాలా మంది అచ్చే దిన్ ఎక్కడ అని అడుగుతున్నారు. సగటు మనిషి సమస్యలు చూసి కలత చెందాను. అందుకే బీజేపీ మిత్రపక్షాన్ని వదిలి కాంగ్రెస్‌లో చేరాను అని అభినందన్ చెప్పారు.

ప్రస్తుతం చత్తీస్‌గఢ్‌లోని జగ్‌దల్‌పూర్, దంతేవాడా, కొండగావ్, బస్తర్ ప్రాంతాల్లో కాంగ్రెస్ తరఫున ఈయన ప్రచారం చేస్తున్నారు. ప్రతి చోటా ఆయన మోదీ ైస్టెల్లోనే మాట్లాడుతూ ఆయనను హేళన చేసే ప్రయత్నం చేస్తున్నారు. మోదీలాగే మిత్రో అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టి అచ్చే దిన్ ఇప్పట్లో రావని చెబుతున్నారు. మోదీవన్నీ తప్పుడు వాగ్దానాలేనని, కాంగ్రెస్‌కు ఓటేసి అభివృద్ధికి పాటుపడాలని ఆయన కోరుతున్నారు. 2014 తర్వాత తొలిసారి మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా అభినందన్ ప్రచారం చేస్తున్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో అభినందన్‌తోపాటు మరికొందరు మోదీలాగా కనిపించేవాళ్లు వివిధ చోట్ల బీజేపీ తరఫున ప్రచారం చేశారు.

3466
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles