బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో అల్పపీడనాలు

Mon,October 8, 2018 06:26 AM

Minor poisons in the Bay of Bengal and Arabian Sea

చెన్నై/ తిరువనంతపురం/న్యూఢిల్లీ : బంగాళాఖాతంతోపాటు అరేబియా సముద్రంలో ఏకకాలంలో ఏర్పడిన రెండు వేర్వేరు అల్పపీడనాలు దక్షిణాదికి ముప్పుగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ దీవులకు తూర్పు దిక్కుగా ఏర్పడిన అల్పపీడనం రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం పేర్కొన్నది. మరోవైపు ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన మరో వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉన్నదని తెలిపింది. దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో ఈ నెల 9వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి రానున్న 72 గంటల్లో ఒడిశా తీరం దిశగా కదులుతుందని ఆర్‌ఎండీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎస్ బాలచంద్రన్ తెలిపారు. అల్పపీడన ప్రభావంతో గత 24 గంటల్లో తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. పుదుకోైట్టె జిల్లాలోని మిమిసాల్ తీర ప్రాంత గ్రామంలో 13 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించారు. రానున్న 24 గంటల్లో తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో భారీవర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నదని ప్రకటించారు. చెన్నై, చుట్టుపక్కల ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.
అరేబియాలో తుఫాను పరిస్థితులు.. కేరళకు పొంచి ఉన్న ముప్పు
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉన్నందున రానున్న 48 గంటల్లో కేరళకు భారీ ముప్పు ఏర్పడవచ్చని ఐఎండీ అంచనా వేసింది.

తెలంగాణకు వర్షసూచన..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నదని.. ఆ తర్వాత రాష్ట్రంలో పొడి వాతావరణ పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఈ అల్పపీడనం కారణంగా ఒడిశాలో ఈ నెల 10వ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కేరళతోపాటు తమిళనాడు, పుదుచ్చేరి, లక్షద్వీప్ ద్వీపసమూహంలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్‌గా మారి ఒమన్, యెమన్ దేశాల వద్ద తీరాన్ని దాటుతుందని వెల్లడించారు. ఆగ్నేయ, తూర్పుమధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ఒమన్ సలలాహ్ నగరానికి తూర్పు, ఆగ్నేయం దిశగా 1340 కి.మీ., యెమన్‌లోని సొకొత్రా ద్వీపానికి తూర్పు దిశగా 1250 కి.మీ., లక్షద్వీప్‌లోని మినికాయ్ ద్వీపానికి పడమర, వాయువ్యం దిశగా 940 కి.మీ.దూరంలో కేంద్రీకృతమై ఉన్నదని తెలిపారు. తుఫాను పరిస్థితుల నేపథ్యంలో తీరరక్షక దళం హైఅలర్ట్ ప్రకటించింది. దీంతో డ్రోనియర్ విమానాన్ని, పలు నౌకలను కేరళ, లక్షద్వీప్, మినికాయ్ ద్వీపం, దక్షిణ తమిళనాడు తీరాల్లో సిద్ధంగా ఉంచింది. తుఫాను పరిస్థితుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, సంసిద్ధతపై కొచ్చి, లక్షద్వీప్ అధికారులతో ఓ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

5024
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles