20ఏళ్లు సీఎంగా పనిచేసి.. సింగిల్ రూమ్‌లో ఉంటున్నారు..

Fri,March 9, 2018 11:54 AM

Manik Sarkar, Chief Minister For 20 Years Has Moved Into One Room Homeఅగర్తల: 20ఏళ్ల పాటు త్రిపుర రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన మాణిక్ సర్కార్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోర పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజీనామా చేసిన ఆయన సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. అగర్తలలోని సీపీఎం పార్టీ ఆఫీసులోని ఓ చిన్న గదిలో ఉంటున్నారు. ఇప్పటి వరకు ఆయన నివాసం ఉన్న మార్క్స్ ఏంజెల్స్ సరణి బంగ్లాను గురువారం ఖాళీ చేసి అక్కడ నుంచి అరకిలోమీటరు దూరంలోని పార్టీ గెస్ట్‌హౌస్‌లో ఒక గదికి మారారు. మాణిక్ సర్కార్ తన భార్య పంచాలీ భట్టాచార్యతో కలిసి పార్టీకి చెందిన గెస్ట్‌హౌస్‌లోని సింగిల్ రూమ్‌లో ఉంటారని సీపీఎం నేత బిజ్జన్ దార్ వెల్లడించారు. పార్టీ కార్యాలయం కిచెన్‌లో వండిన సాధారణ భోజనాన్ని తాను కూడా తింటానని మాణిక్ చెప్పారు. మరోవైపు గురువారం రాత్రి బీజేపీ సీనియర్ నేత రామ్‌మాధవ్.. మాణిక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. త్రిపురలో నూతనంగా కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకావాలని ఆయన కోరారు. భారతదేశంలోనే అత్యంత పేద ముఖ్యమంత్రిగా మాణిక్ సర్కార్ పేరొందిన విషయం తెలిసిందే. సర్కార్ దంపతులకు పిల్లలు కూడా లేరు. నూతనంగా ఏర్పాటయ్యే ప్రభుత్వం ఆయనకు క్వార్టర్ కేటాయిస్తే అందులోకి మారే అవకాశం ఉందని సీపీఎం నేత చెప్పారు.

వరుసగా నాలుగుసార్లు సీఎంగా పనిచేసి ఐదోసారి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడానికి ముందు దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్న ఆయన ఆస్తుల వివరాలు దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. మాణిక్ వ్యక్తిగతంగా కలిగిన మొత్తం ఆస్తి విలువ రూ.3,930. ఆయన పేరిట కనీసం వేరే ఇల్లుతో పాటు స్థిర చరాస్థులు, షేర్లు , బంగారు ఆభరణాలు ఏమీ లేవని తనకు వచ్చిన జీతాన్ని పార్టీ ఫండ్‌గా ఇస్తున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే.

8287
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles