తల్లిని చంపి.. ఇంట్లోనే శవాన్ని ఉంచాడు..

Thu,March 14, 2019 03:15 PM

Man kills mother lives with her corpse for a week  in Puducherry

పుదుచ్చేరి : పలువురితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోన్న తల్లిని తనయుడే కిరాతకంగా హత్య చేశాడు. తల్లి శవాన్ని ఇంట్లోనే వారం రోజుల పాటు ఉంచాడు. ఈ దారుణ సంఘటన పుదుచ్చేరిలోని ఓర్లియంట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జయశేఖర్ ఉదయార్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య సెల్వీ కాగా, రెండో భార్య జయమేరి. అనారోగ్య సమస్యలతో జయశేఖర్ 2013లో మృతి చెందాడు. ఆ తర్వాత సెల్వీ, జయమేరి మధ్య ఆస్తి తగాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో సెల్వీ సోదరుడు మనివన్నన్‌ను జయమేరి హత్య చేయించింది. ఈ హత్య కేసులో జయమేరితో పాటు మరో ఏడుగురు వ్యక్తులు జైలుకెళ్లారు. కొంత కాలం తర్వాత బెయిల్‌పై జయమేరి విడుదల అయ్యారు.

పుదుచ్చేరిలోని కృష్ణా నగర్‌లో జయమేరి కొత్త ఇల్లును కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే జయమేరి కుమారుడు అమలోర్ పవనాథన్(28) కొత్త ఇంటికి వచ్చి తల్లి వద్దే ఉంటున్నాడు. అయితే తన తల్లి పలువురితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడం పవనాథన్‌కు నచ్చలేదు. ఈ విషయంలో ఇరువురి మధ్య పలుమార్లు గొడవలు చోటు చేసుకున్నాయి. మొత్తానికి తల్లి ప్రవర్తన నచ్చకపోవడంతో.. ఆమెను వారం రోజుల క్రితం కత్తితో మెడపై నరికి చంపేశాడు. ఆ తర్వాత వారం రోజుల పాటు తల్లి శవాన్ని ఇంట్లోనే ఉంచి తన పనులను చేసుకున్నాడు. ఇక తన మనసుకు ఏమానుకున్నాడో తెలియదు కానీ.. పవనాథన్ ఓర్లియంట్ పోలీసుల ఎదుట బుధవారం లొంగిపోయాడు. పవనాథన్ కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

3147
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles