పాల కల్తీకి పాల్పడితే మూడేండ్ల జైలుTue,March 13, 2018 10:09 PM

పాల కల్తీకి పాల్పడితే మూడేండ్ల జైలు

ముంబై : పాల కల్తీని నివారించడానికి పకడ్బందీ చట్టం తీసుకురానున్నామని మహారాష్ట్ర ఆహార, పౌరసరఫరాల మంత్రి గిరిశ్ బపత్ తెలిపారు. ఎవరైనా పాల కల్తీకి పాల్పడితే నాన్ బెయిలెబుల్ కేసు నమోదు చేసేలా, మూడేండ్ల పాటు జైలు శిక్ష అనుభవించేలా త్వరలో చట్టం తెస్తామని చెప్పారు. పాల కల్తీపై మహారాష్ట్ర అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. ప్రస్తుత చట్టం ప్రకారం పాలకల్తీకి పాల్పడితే బెయిలెబుల్ కేసుగా పరిగణిస్తున్నారని, సంబంధిత వ్యక్తికి ఆరు నెలల వరకు జైలు శిక్ష విధిస్తున్నారని తెలిపారు. అయితే కల్తీని నివారించడంలో భాగంగా ఈ శిక్షను మూడేండ్ల వరకు పొడిగించేలా చట్టం తేనున్నామని పేర్కొన్నారు.

నాన్‌బెయిలెబుల్ కేసుగా పరిగణించడంతో నిందితుడు తప్పించుకునే అవకాశం లేదని చెప్పారు. అయితే ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి జీవితకాల కారాగార శిక్ష విధించేలా చట్టం తేవాలని సభ్యులు డిమాండ్ చేయగా.. ఇందుకు సాధ్యం కాదని మంత్రి తెలిపారు. పాల కల్తీ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం నాలుగు సంచార వాహనాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో రోజువారీగా కల్తీ పరీక్షలను నిర్వహించడం కుదరడం లేదని చెప్పారు. ఇకపై రోజువారీగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

1469
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS