తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కన్నుమూత

Tue,August 7, 2018 06:49 PM

చెన్నై: డీఎంకే పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డా. కళైజ్ఞర్ గా ప్రసిద్ధి చెందిన ముత్తువేల్ కరుణానిధి(95) కన్నుమూశారు. తీవ్ర జ్వరం, మూత్ర పిండాల సమస్య కారణంగా పది రోజుల క్రితం చెన్నైలోని కావేరి దవాఖానలో కరుణానిధి చేరిన సంగతి తెలిసిందే. పరిస్థితి విషమించడంతో నేడు ఆయన మృతిచెందారు. ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు అధికారిక ప్రకటనను విడుదల చేశాయి. 1969లో సీఎన్ అన్నాదురై మరణించినప్పటి నుంచి నేటి వరకు ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కరుణానిధి డీఎంకే పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. తమిళనాడు రాష్ర్టానికి మూడో ముఖ్యమంత్రిగా 1969లో పదవి చేపట్టి- 1971 వరకు, 1971-1974, 1989-1991, 1996-2001, 2006-2011 ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో 13 సార్లు గెలిచి గిన్నీస్ బుక్ రికార్డుకెక్కారు. 2004 ఎన్నికల్లో తమిళనాడులోని 40 లోక్‌సభ స్థానాలకు గాను నలబై గెలిచి యూపీఏ ప్రభుత్వం నెలకొల్పడంలో ప్రధాన పాత్ర పోషించారు. తాను స్వయంగా నాస్తికుడిగా ప్రకటించుకున్నారు. ఈ.వి రామస్వామి నాయకర్ సిద్ధాంతాలను అనుసరించారు. 1971 సంవత్సరంలో అన్నాదురై యునివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నారు.

ఉద్య‌మాలు, సాహిత్య‌మంటే ఆస‌క్తి
కేవలం ఎనిమిదో తరగతి వరకే చదువుకున్న కరుణానిధికి ఉద్యమాలన్నా, సాహిత్యమన్నా ఎంతో ఆసక్తి చూపించేవారు. మూడ విశ్వాసాల నుంచి ప్రజలను చైతన్యం చేసేందుకు ఎన్నో నాటికలు రాసి ప్రదర్శించేవారు. జస్టిస్ పార్టీ నాయకుడు అలగిరిస్వామి ప్రసంగాలకు ఉత్తేజితుడై 14 ఏండ్ల వయస్సు నుంచే హిందీ వ్యతిరేకోధ్యమంలో పాల్గొని అనేక సార్లు జైలుకు వెళ్లారు. ద్రవిడ ఉద్యమం, హిందీ వ్యతిరేకోద్యమాల్లో కరుణానిధి తనదైన ముద్ర వేశారు. కరుణ తమిళ సాహిత్యంలో తనదైన ప్రతిభను కనబర్చారు. పద్యాలు, నాటికలు, లేఖలు, నవలలు, జీవిత చరిత్రలు, సినిమాలు, సంభాషణలు, పాటలు మొదలైన అన్ని రంగాల్లో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. 1970 సంవత్సరంలో పారిస్‌లో మూడో ప్రపంచ తమిళ మహాసభ నిర్వహించారు. 1987 సంవత్సరంలో ఆరో ప్రపంచ తమిళ మహాసభ కౌలాంలంపూర్(మలేషియా)లో నిర్వహించారు. 2010లో నిర్వహించిన ప్రపంచ తమిళ మహాసభలో సెమ్మోజియానా తమిజు మోజియం అను తమిళ కాన్ఫరెన్స్ అధికారిక పాట రాశారు. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహెమాన్ సంగీతం అందించారు.

కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి ముత్తువేల్
నాయీ బ్రహ్మణ కులానికి చెందిన ముత్తవేల్ - అంజుగం దంపతులకు జూన్ 3, 1924లో తంజాపూర్‌లోని తిరుక్కువలైలో జన్మించారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని చేపాక్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి ముత్తువేల్ . 1957 సంవత్సరంలో మొదటి సారిగా కులిత్తరై నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1962 సంవత్సరంలో తంజావూర్ నియోజవర్గం నుంచి గెలిచి రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష ఉప నేతగా పనిచేశారు. 1967లో డీఎంకే పార్టీ అధికారంలో వచ్చినప్పుడు అన్నాదురై మంత్రివర్గంలో కరుణానిధి ప్రజా పనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 1971లో చెన్నై పట్టణంలోని సైదాపేట నియోజకవర్గం, 1977, 1980లో చైన్నై అన్నానగర్, 1989, 1991లో చెన్నై హార్బర్ నియోజకవర్గం, 1996, 2001, 2006లో చెన్నై చపాక్ నియోజకవర్గం, 2011లో తిరువారూర్ నియోజకవర్గం, 2016లో చెన్నై చపాక్ నియోజకవర్గంలో గెలుపొందారు.

ముగ్గురు భార్య‌ల ముద్దుల హీరో..
దక్షిణ భారత సినిమా రంగానికి చెందిన వారిలో ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి. 1941లో మురసోలి అనే పత్రికను కూడా ప్రారంభించారు. అన్నాదురై శిష్యుడిగా ఆయన ఆశయాలే వెన్నుదన్నుగా, ద్రవిడోధ్యమమే శ్వాసగా హేమాహేమీలను ఎదుర్కొని నిలిచారు. రాజకీయాలతో పాటు రచనలతో ప్రజలను మెప్పించి కళైంగర్ అనే బిరుదు పొందారు. ముత్తు, అళగిరి, స్టాలిన్, తమిళరసు కుమారులు కాగా... సెల్వి, కనిమొళి కుమార్తెలు. మొదటి భార్య పద్మావతి, రెండో భార్య దయాళు అమ్మాల్, ప్రస్తుతం మూడో భార్య రాజాది అమ్మాల్‌తో జీవిస్తున్నారు. కరుణ మొదటి భార్య పద్మావతి యుక్తవయస్సులోనే కన్నుమూశారు. పద్మావతి కొడుకైన ఎంకే ముత్తు చిన్నతనంలోనే మృతి చెందారు. అలగిరి, స్టాలిన్, సెల్వీ, తమిళరుసు దయాళు అమ్మల్‌కు జన్మించారు. కనిమొలి రాజాది అమ్మల్‌కు జన్మించారు.

కరుణ వయస్సు మీరుతుండటంతో రాజకీయ వారసుడు ఎవరనే విషయంలో పోటి నెలకొంది. కరుణానిధి మాత్రం స్టాలిన్‌వైపే మొగ్గు చూపారు. అలగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. తనకు సరైన వారసుడు స్టాలినేనని కరుణ అనేక సార్లు ప్రకటించారు. పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడిగా స్టాలిన్‌ను నియమించారు. పార్టీలో 30 శాతం మహిళలకు రిజర్వేషన్, పేదరిక నిర్మూలన, తాగునీటి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కరుణకు మాత్రమే స్వంతమని డీఎంకే కార్యకర్తలు అంటారు. రుణమాఫీ, పౌష్టికాహార పథకం, చేనేతకు ఉచిత విద్యుత్ వంటి ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు.
2546
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles