కర్ణాటకకు రెండో రాజధాని!

Wed,August 1, 2018 02:55 PM

Kumaraswamy bats for second capital for Karnataka amid protests

బెంగళూరు: కర్ణాటకలో ఉత్తర, దక్షిణ రచ్చ మళ్లీ మొదలైంది. ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలన్న బీజేపీ డిమాండ్‌తో మరోసారి విభజన సెగలు మొదలయ్యాయి. దీనికి మరో పరిష్కారాన్ని ముఖ్యమంత్రి కుమారస్వామి ఆలోచిస్తున్నారు. అందులోభాగంగానే రాష్ర్టానికి రెండో రాజధాని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అన్నదానిపై ఆయన కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే బెల్గాంలో సువర్ణ విధాన సౌధ ఉంది. అక్కడికే మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాలను కూడా తరలించాలని భావిస్తున్నట్లు కుమారస్వామి చెప్పారు.

నిజానికి నేనీ విషయాన్ని 12 ఏళ్ల కిందటే చెప్పాను. కానీ తర్వాతి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అందుకే అక్కడ ఓ విధాన సౌధను నిర్మించాలని అప్పుడే చెప్పాను. ఇప్పుడక్కడ అసెంబ్లీ సెషన్ కూడా నడుస్తున్నది. బీజేపీ అనవసరంగా దీనిని పెద్దదిగా చేస్తున్నది. మరో 15, 20 రోజుల్లో నేనే ఓ ప్రకటన చేస్తాను. అంతేకాదు మంగళూరును ఆర్థిక రాజధానిగా చేయాలని కూడా చూస్తున్నాను అని కుమారస్వామి స్పష్టంచేశారు. బెల్గాం విషయంలో మహారాష్ట్రతో దశాబ్దాలుగా కర్ణాటకకు విభేదాలు ఉన్నాయి. దానిపై పట్టుకోసమే కర్ణాటక ప్రత్యేకంగా అక్కడ సువర్ణ విధాన సౌధను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఉత్తర కర్ణాటక నినాదంతో మరోసారి అది తెరపైకి వచ్చింది. ఇప్పటికే తమను కూడా సమానంగా చూడాలని డిమాండ్ చేస్తూ గురువారం బంద్‌కు కూడా ఆందోళనకారులు పిలుపునిచ్చారు.

నిజానికి 2006లోనే బీజేపీతో కలిసి కుమారస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో బెల్గాంను రెండో రాజధానిగా గుర్తిస్తూ అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది. అయితే తాజాగా మరోసారి కర్ణాటక సీఎం అయిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లోనే ఉత్తర కర్ణాటకను నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు వచ్చాయి. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప ఈ విషయంలో కుమారస్వామి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బెల్గాంలోని సువర్ణ విధాన సౌధ ముందు మంగళవారం పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతుగా ఉన్న లింగాయత్ మత పెద్దలు ఆందోళన చేపట్టారు.

2452
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles