
చెన్నై: జయేంద్ర సరస్వతి అనంతరం శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి కంచి కామకోటి పీఠం 70వ అధిపతి కానున్నారు. కంచి కామకోటి పీఠాధిపతిని శంకరాచార్యగా సంబోధిస్తారు. కంచి శంకరాచార్యను.. హిందూ అద్వైత వేదాంత సిద్ధాంత పరిరక్షకులలో ఒకరిగా పరిగణిస్తారు. విజయేంద్ర సరస్వతి త్వరలోనే ఒక యువకుడిని తన వారసుడిగా ప్రకటించాల్సి ఉంటుంది. విజయేంద్రను ఇప్పటివరకు తమిళ అనుయాయులు బాల పెరియార్గా సంబోధించేవారు. 1969లో కాంచీపురం సమీపంలోని తాండళంలో జన్మించిన శంకరనారాయణన్ ఆరో తరగతి వరకు పాఠశాలకు వెళ్ళారు. సాయంకాలం వేదవిద్యను అభ్యసించారు. ఆయన తండ్రి కృష్ణమూర్తిశాస్త్రి వేదపండితుడు. శంకరనారాయణన్ తన 14వ ఏట.. 1983లో జయేంద్ర సరస్వతి ద్వారా సన్యాసాశ్రమం స్వీకరించారు. జయేంద్ర ఆయనను తన వారసుడిగా ప్రకటించి, శంకర విజయేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు. 1987లో జయేంద్ర సరస్వతి ఆకస్మికంగా కనిపించకుండా పోయినప్పుడు విజయేంద్ర 70వ పీఠాధిపతి అయ్యారు. అనూహ్యంగా జయేంద్ర తిరిగి రావడంతో అప్పుడు ముగ్గురు పీఠాధిపతులున్న అసాధారణ పరిస్థితి నెలకొంది. ఆలయాల నిర్వహణకు సంబంధించి లోకధర్మ సేవా ఫౌండేషన్ ట్రస్టును నెలకొల్పడం వెనుక విజయేంద్ర సైద్ధాంతిక ప్రోత్సాహమున్నట్లు భావిస్తారు.