హైదరాబాద్: జెట్ ఎయిర్వేస్ రోజు రోజుకూ దివాళా దిశగా వెళ్తోంది. తాజాగా ఆ విమాన సంస్థ.. 13 అంతర్జాతీయ రూట్లలో తమ విమానాలను నిలిపివేసింది. ఏప్రిల్ నెల చివర వరకు ఇది వర్తిస్తుందని ఆ సంస్థ పేర్కొన్నది. దీంతో మొత్తం జెట్ ఎయిర్వేస్కు చెందిన 54 విమానాలు శాశ్వతంగా గ్రౌండ్ అయ్యాయి. ఢిల్లీ, ముంబై నుంచి విదేశాలకు వెళ్లే జెట్ ఎయిర్వేస్ విమానాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. పుణె టు సింగపూర్, పుణు టు అబుదాబి విమానాలను రద్దు చేశారు. ముంబై టు మాంచెస్టర్ సర్వీసులను ఇప్పటికే నిలిపేశారు. నరేశ్ గోయల్‌కు చెందిన జెట్ ఎయిర్వేస్ సంస్థ నిధుల కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నది. బెయిల్ఔట్ ప్యాకేజీ కోసం కూడా ఎదురుచూస్తున్నది. కానీ పరిస్థితులు ఎక్కడా అనుకూలంగా లేవు. ఆ కంపెనీ ఫ్లయిట్ల సర్వీసు నాలుగో వంతుకు పడిపోయింది. మరోవైపు ఆ సంస్థ పైలట్లు.. ప్రధాని మోదీతో పాటు పౌర విమానయానశాఖ మంత్రి సురేశ్ ప్రభుకు తాజాగా లేఖ రాశారు. తమకు జీతాలు ఇప్పించాలని వాళ్లు ఆ లేఖలో కోరారు. జెట్ ఎయిర్వేస్ దివాళా దశకు చేరుకున్నదని, దీని వల్ల వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నన్నారని, దాంతో విమాన ప్రయాణ ఖర్చులు కూడా పెరుగుతాయని పైలట్ల సంఘం తమ లేఖలో పేర్కొన్నది.