ఏప్రిల్ 1న ఉదయం నింగిలోకి ఎమిశాట్!

Mon,March 25, 2019 10:41 PM

ISRO to Launch EMISAT 28 Foreign Satellites on April 1

న్యూఢిల్లీ, : శత్రు దేశాల ఎత్తుల్ని చిత్తు చేసే అత్యాధునిక నిఘా ఉపగ్రహం (శాటిలైట్) ఎమిశాట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన ఎమిశాట్‌ను ఏప్రిల్ 1న రోదసిలోకి ప్రయోగించనున్నారు. శత్రు దేశాల రాడార్లను పసిగట్టడం, ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్, హై రిజల్యూషన్ చిత్రాలను సేకరించేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పొరుగుదేశం పాకిస్థాన్ దురాగతాల్ని ముందే పసిగట్టేందుకు, వారి కదలికలపై డేగకన్ను వేసేందుకు ఇది దోహదపడుతుంది. 436 కిలోల బరువున్న ఈ శాటిలైట్‌ను రోదసిలో 763 కి.మీ.ల కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో సోమవారం వెల్లడించింది. ఈ సందర్భంగా రక్షణరంగ నిపుణుడు రవిగుప్తా మాట్లాడుతూ.. ఎమిశాట్ ఉపగ్రహం మూడు ప్రత్యేకతలను కలిగి ఉంది. అంతర్జాతీయ సరిహద్దుల్లో శత్రుదేశాల రాడార్ల కార్యకలాపాల్ని కనిపెడుతుంది. శత్రు దేశాల భాభూగానికి సంబంధించిన చిత్రాలను అందిస్తుంది.

ఆ ప్రాంతంలో కమ్యూనికేషన్ పరికరాలు ఎన్ని పనిచేస్తున్నాయో కనిపెట్టి ఆ వివరాలను అందజేస్తుంది.. అని వివరించారు. గతంలో శత్రు దేశాల ఆయుధ సంపత్తి, సైనికుల కదలికల్ని తెలుసుకునేందుకు డ్రోన్లు, ఏరోస్టార్లు, హీలియం బెలూన్లను ఉపయోగించేవారమని గుప్తా చెప్పారు. డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా చాలా కష్టం. అవి కొన్ని గంటలపాటే ఎగురుతాయి. హీలియం గ్యాస్ ఉన్నంతవరకే బెలూన్లు పనిచేస్తాయి. కేవలం ఎలక్ట్రానిక్ శాటిలైట్‌లు మాత్రమే నిరంతరం పనిచేస్తూ శత్రువులకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని అందజేస్తాయి. శత్రు రాడార్లకు చిక్కకుండా ఇవి పనిచేస్తాయి అని వివరించారు. సరిహద్దుల్లోని కీలక ప్రాంతాల్లో సెల్‌ఫోన్ వంటి కమ్యూనికేషన్ పరికరాలు ఎన్ని పనిచేస్తున్నాయనే విషయాన్ని భద్రతా, నిఘా సంస్థలకు ఈ శాటిలైట్లు చేరవేస్తాయని గుప్తా చెప్పారు. ఇటీవల పాకిస్థాన్ బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరంలో 300 సెల్‌ఫోన్లు యాక్టివ్‌గా పనిచేస్తున్నట్లు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్‌టీఆర్వో) చెప్పిన తర్వాతే భారత వాయుసేన మెరుపుదాడులు చేసిందని ఆయన గుర్తుచేశారు.

ప్రయోగం ఎప్పుడు..
పీఎస్‌ఎల్వీ సీ-45 రాకెట్ ద్వారా ఎమిశాట్‌ను ఏప్రిల్ 1న ఉదయం 9:30 గంటలకు ప్రయోగించనున్నారు. దీంతోపాటు 28 విదేశీ ఉపగ్రహాల్ని కూడా రోదసిలోకి పంపనున్నారు. వీటిలో అమెరికా, లూథియానా, స్పెయిన్, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన ఉపగ్రహాలతోపాటు, మూడు ఎక్స్‌పెరిమెంటల్ పేలోడ్లు కూడా ఉన్నాయి. ఇస్రో చరిత్రలోనే తొలిసారిగా పేలోడ్లని మూడు వేర్వేరు కక్ష్యల్లోకి పీఎస్‌ఎల్వీ రాకెట్ వదిలిపెట్టనున్నది. ఎమిశాట్ ఉపగ్రహాన్ని 763 కి.మీ.ల కక్ష్యలో, 28 విదేశీ శాటిలైట్లను 504 కి.మీ.ల కక్ష్యలో, చివరగా మూడు పేలోడ్లను (పీఎస్-4) 485 కి.మీ.ల కక్ష్యలో విడిచిపెట్టనున్నది.

1034
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles