ఎమిశాట్ ఏం చేస్తుంది?

Tue,April 2, 2019 06:45 AM

ISRO Place EMISAT

హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)లో ఎమిశాట్‌ను అభివృద్ధి చేశారు. ఇది ఎంతో అధునాతనమైన నిఘా ఉపగ్రహం. ఇస్రో, డీఆర్‌డీఓకు చెందిన శాస్త్రవేత్తలు ఐదేండ్ల పాటు కృషి చేసి దీనిని అభివృద్ధి చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అత్యంత సున్నితమైన ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థ ఉన్న ఈ ఉపగ్రహం శత్రుదేశాల రాడార్లపై నిఘా పెడుతుంది. శత్రుదేశాల రాడార్ల నుంచి వెలువడే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కిరణాలను గుర్తించి, వాటిని అడ్డుకుంటుంది. శత్రుదేశాలు ఎక్కడెక్కడ రాడార్లను అమర్చారో గుర్తించి సమాచారం అందజేస్తుంది. శత్రుదేశాల భౌగోళిక పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని, చిత్రాలను అందిస్తుంది. ఎమిశాట్‌లో ఎలక్ట్రానిక్ స్పెక్ట్రమ్ పరికరాన్ని అమర్చారు.

దీని ద్వారా శత్రుదేశాలు ఎటువంటి రాడార్‌ను, ఎంతదూరంలో ఉపయోగిస్తున్నాయో తెలుసుకోవచ్చు. శుత్రుదేశాలపై నిఘా వేయడానికి గతంలో డ్రోన్లు, బెలూన్లను ఉపయోగించేవారు కానీ ఇప్పుడు ఎమిశాట్ రాకతో 24 గంటలూ నిగా వేసే అవకాశం లభించింది. నౌకలలోని రాడార్ల నుంచి వెలువడే రేడియో సంకేతాలను కూడా ఎమిశాట్ అడ్డుకోగలదని ఓ శాస్త్రవేత్త పేర్కొన్నారు. యుద్ధ సమయంలో ఏ దేశమైనా తొలుత శత్రుదేశాల సమాచార వ్యవస్థలను, స్థావరాలను ధ్వంసం చేస్తుంది. అప్పుడు శత్రువుకు సరైన లక్ష్యాలు తెలియకుండా దాడి చేయడం కుదరదు. అందుకే ముందు శత్రువుల కమ్యూనికేషన్ స్థావరాలు, రాడార్ వ్యవస్థలను గుర్తించే వ్యవస్థ అత్యవసరం. ఇప్పుడు ఎమిశాట్‌ను ఈ అవసరం కోసమే ప్రయోగించినట్టు తెలుస్తున్నది. 436 కిలోల బరువున్న ఎమిశాట్‌ను రూపొందించేందుకు రూ.432 కోట్లు వచ్చించారని, ఎనిమిదేండ్ల పాటు పని చేయనున్నదని సమాచారం.

1508
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles