విక్ర‌మ్‌కు చివ‌రి రోజు..

Sat,September 21, 2019 09:37 AM

హైద‌రాబాద్‌: భూమిపై 14 రోజులు.. చంద్రుడిపై ఒక రోజుతో సమానం. సెప్టెంబ‌ర్ 7వ తేదీన విక్ర‌మ్ ల్యాండ‌ర్ చంద్రుడిపై గ‌తిత‌ప్పి ప‌డిపోయిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత విక్ర‌మ్ ఆచూకీపై ఆశ‌లు గ‌ల్లంతు అయ్యాయి. ఇవాళే విక్ర‌మ్‌కు చివ‌రి రోజు. చంద్రుడిపై విక్ర‌మ్ కూలి 14 రోజులు కావొస్తోంది. ఈ రోజు దాటితే.. ఇక విక్ర‌మ్ లేవ‌డం క‌ష్ట‌మే. ల్యాండ‌ర్‌లో ఉన్న సోలార్ ప్యాన‌ల్స్ తెరుచుకుంటేనే.. దానితో సంకేత సంబంధాల‌ను పున‌రుద్ద‌రించే అవ‌కాశాలు ఉన్నాయి. లూనార్ డే మారితే.. ఇక విక్ర‌మ్ లేవ‌డం మ‌రింత క‌ష్టం అవుతుంది. లూనార్ డే రోజుల్లో చంద్రుడి ద‌క్షిణ ద్రువాన్ని నీడ ఆవ‌హిస్తుంది. అప్పుడు ఆ ప్రాంతం మైన‌స్ 200 డిగ్రీల‌కు వెళ్లిపోతుంది. ఆ స‌మ‌యంలో ల్యాండ‌ర్‌లో ఉన్న ప‌రిక‌రాలు అన్నీ ఫ్రీజ్ అవుతాయి. ఇదే జ‌రిగితే.. ఇక విక్ర‌మ్‌తో లింకు దొర‌క‌డం అసాధ్యమ‌వుతుంది.


చంద్ర‌యాన్‌2లోని సుమారు 1471 కిలోల బ‌రువున్న ల్యాండ‌ర్‌.. మాంజిన‌స్ సీ, సింపేలియ‌స్ ఎన్ క్రేట‌ర్ల మ‌ధ్య కూలింది. సాఫ్ట్ ల్యాండింగ్ కాక‌పోవ‌డంతో.. ల్యాండ‌ర్‌లో ఉన్న రోవ‌ర్ కూడా దెబ్బ‌తిన్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు భావిస్తున్నారు. కానీ దీనికి సంబంధించి పూర్తి స‌మాచారం లేదు. ఫైన్ బ్రేకింగ్ స‌మ‌యంలో.. ల్యాండ‌ర్‌లో ఉన్న ఇంజిన్లు విక్ర‌మ్ వేగాన్ని నియంత్రించ‌క‌పోవ‌డం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు నిర్ధార‌ణ‌కు వ‌స్తున్నారు. విక్ర‌మ్ ఆచూకీ కోసం డీప్ స్పేస్ సెంట‌ర్ నుంచి ఇస్రో, నాసాలూ సంకేతాలు పంపిస్తూ నిత్యం ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నాయి. అయితే ఇస్రో పంపే సంకేతాల‌కు ఆర్బిటార్ స్పందిస్తున్న‌ది. కానీ విక్ర‌మ్ మాత్రం నిర్జీవంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఫినిక్స్ ప‌క్షి త‌ర‌హాలో.. విక్ర‌మ్ మ‌ళ్లీ స్పందిస్తుంద‌ని ఆశిద్ధాం.

3071
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles