నేడు మైక్రోశాట్ ఆర్, కలాంశాట్ ఉపగ్రహాల ప్రయోగం

Thu,January 24, 2019 06:38 AM

ISRO Launch Countdown for Microsat R and Kalamsat Satellites Starts Today

చెన్నై : పీఎస్‌ఎల్వీ సీ44 ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి ఈ రోజు రాత్రి 11.37 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియ నిన్న రాత్రి 7.37 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 28 గంటల పాటు కొనసాగిన అనంతరం నేటి రాత్రి 11.37 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ44 నింగిలోకి దూసుకెళ్లనుంది. భారత రక్షణ, పరిశోధన సంస్థ(డీఆర్‌డీవో)కు సంబంధించిన ఇమేజింగ్ శాటిలైట్ మైక్రోశాట్ ఆర్‌తోపాటు చెన్నై విద్యార్థులు రూపొందించిన కలాంశాట్ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ సీ44 ద్వారా ఇస్రో నింగిలోకి పంపుతున్నది.

ప్రయోగించిన 13 నిమిషాల అనంతరం 277 కిలోమీటర్ల ఎత్తులో మైక్రోశాట్ ఆర్ ఉపగ్రహం వాహకనౌక నుంచి వేరుపడనుంది. పీఎస్‌ఎల్వీ సీ 44 ప్రయోగంలో బరువును తగ్గించి, పరిమాణాన్ని పెంచేందుకు తొలిసారి నాలుగోదశలో అల్యూమినియం ట్యాంక్‌ను వినియోగిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ కే శివన్ వెల్లడించారు. పీఎస్‌ఎల్వీ ప్రయోగాన్ని నాలుగు దశల్లో చేపట్టనున్నారు. సాధారణంగా పీఎస్‌ఎల్వీ మొదటి దశలో ఆరు స్ట్రాపాన్ బూస్టర్లను వినియోగిస్తారు. కానీ పీఎస్‌ఎల్వీ సీ44లో కేవలం రెండు స్ట్రాపాన్ బూస్టర్లనే వాడారు. దీంతో దీన్ని పీఎస్‌ఎల్వీ- డీఎల్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ తరహా రాకెట్‌ను ఇస్రో ఉపయోగిస్తుండడం ఇదే తొలిసారి. వాహకనౌకలోని పీఎస్4(నాలుగో దశ) దశను పలు పరిశోధనలకు పునర్వినియోగించుకునేలా దాన్ని అంతరిక్షలోనే ఉంచనున్నారు. కలాంశాట్ మొట్టమొదటిగా పీఎస్4 దశను వినియోగించుకోనుంది.

526
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles