మాల్యా అప్పగింత సాధ్యమా?

Thu,April 20, 2017 06:57 AM

Is Vijay Mallya handed over to India

హైదరాబాద్: బ్యాంకు రుణాలు ఎగవేసి బ్రిటన్‌కు పరారయిన ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా కేసులో ఒక ముందడుగు పడ్డది. భారత్ అప్పగింత కోరిన నేపథ్యంలో, మాల్యాను మంగళవారం లండన్‌లో అరెస్టు చేయడం, ఆ వెంటనే బెయిల్‌పై విడుదల చేయడమూ వేగంగా జరిగిపోయింది. బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయల మేర ఎగవేసిన మాల్యా సంచులు, సరంజామాతో లండన్ వెళ్ళి ఏడాది దాటింది. ఆయనను అప్పగించాలంటూ ఈ ఏడాది ఆరంభంలో భారత్ బ్రిటన్‌ను కోరింది. బెయిల్‌పై విడుదలయిన మాల్యా తదుపరి విచారణకు మే నెల ఏడవ తేదీన కోర్టుకు హాజరుకావలసి ఉన్నది. న్యాయ విచారణ సుదీర్ఘ ప్రక్రియ అనేది తెలిసిందే. అయినప్పటికీ భారత్ తన వంతుగా మాల్యా అప్పగింత కోసం అవసరమైన పత్రాలు సమర్పిం చి ప్రయత్నాలు సాగిస్తున్నది. మాల్యాను పట్టితెచ్చి మన న్యాయస్థానాల ముందు నిలబెట్టి చట్టప్రకారం విచారణ సాగించవలసిందే. అయితే మొదటగా మన రాజకీయ నాయకత్వానికి చిత్తశుద్ధి ఉండాలె. ఇప్పటి వరకు విదేశాలలోని నిందితులను తెప్పించడం కోసం హడావుడి చేయడమే తప్ప కచ్చితమైన ప్రయత్నం జరుగలేదు. అనేక కేసులలో నిందితులను అప్పగించాలంటూ భారత ప్రభుత్వం సమర్పించిన ఆధారాలు బలహీనమైనవి. మాల్యాను పట్టి తెచ్చే విషయంలో చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు అంటున్నారు. ఇప్పటి వరకైతే మాల్యాను అప్పగించాలంటూ లాంఛనంగా కోరడం, ఇందుకు అక్కడ న్యాయ ప్రక్రియ ప్రారంభం కావడం వరకు బాగానే జరిగింది. కానీ అసలు అప్పగింత ఇంకా ఆమడ దూరంలోనే ఉన్నది. ఈ మాత్రం అరెస్టు- విడుదలకు సంబురపడవలసిందేమీ లేదని న్యాయపరమైన చిక్కులు తెలిసినవారు అంటున్నారు.

మాల్యాను పట్టితేవడం అంత సులభం కాదని అనడానికి అనేక కారణాలు, దృష్టాంతాలు ఉన్నాయి. భారత్, యూకే మధ్య 1993లో నేరస్థుల అప్పగింత ఒప్పందం కుదిరింది. ఆనాటి నుంచి గుజరాత్ అల్లర్లలో నిందితుడైన సమీర్ భాయి పటేల్ తప్ప ఇప్పటి వరకు బ్రిటన్ ఎవరినీ అప్పగించలేదు. ఈ పటేల్ అప్పగింత కూడా ఆయ న వ్యతిరేకించకపోవడం వల్ల సాధ్యమైంది. ఆర్థిక నేరాలకు పాల్పడిన లలిత్ మోదీ, భారత నావికాదళ వార్‌రూమ్ వివరాల లీక్ కేసులో నిందితుడైన రవిశంకరన్, గుల్షన్ కుమార్ హత్యకేసుకు సంబంధించిన నదీమ్ సైఫి గుజరాత్ పేలుళ్ల కేసు టైగర్ హనీఫ్, పురులియా అక్రమ ఆయుధాల కేసు నిందితుడు కిమ్ డేవీ మొదలైన వారంతా ఇంకా బ్రిటన్ లో హాయిగా పొద్దు గడుపుతున్నారు. టైగర్ హనీఫ్ న్యాయపోరాటాలలో ఎదురుదెబ్బ తిన్నతరువాత చివరి ప్రయత్నంగా హోం కార్యదర్శికి విన్నపం చేసుకున్నాడు. 2013 నుంచి హనీఫ్ అప్పగింతపై నిర్ణయం తీసుకోకుండా అక్కడి ప్రభుత్వం నాన్చుతున్నది. అండర్‌వరల్డ్ డాన్ ఇక్బాల్ మిర్చిని తెప్పించడానికి చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. 2013లో ఆయన అక్కడే మరణించడంతో ఆ కథ ముగిసింది. మాల్యా జిల్లా కోర్టులో ప్రతికూల తీర్పు పొందినా, హైకోర్టు, సుప్రీంకోర్టు తలుపు తట్టుతాడు. న్యాయ విచారణ తరువాత కూడా బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూడవల సి ఉంటుంది. ఇదంతా అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. చట్ట ప్రకారం కంపెనీ ఒక స్వతంత్ర గుర్తింపు ఉన్న సంస్థ. తన కంపెనీ చేసిన అప్పులకు ఆయన బాధ్య త వహించడు. ఆయన హామీదారుగా ఉన్నాడనే కారణమే బ్రిటన్ కోర్టు ముందు నిలుస్తుంది. ఉగ్రవాదిని అప్పగించేలా ఒత్తిడి తేవడం తేలిక కానీ ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని, అందులో వ్యాపారస్థులను పట్టితేవడం అంత సులభం కాదు. బ్రిటన్‌తో సహా యూరోపియన్ దేశాల్లో ఉండే భావజాలం అటువంటిది. తమ ఆస్తులను బ్రిటన్‌కు బదిలీ చేసుకొని, అక్కడ తలదాచుకున్న నేరస్థులు అనేక దేశాల వారున్నారు. అం దువల్ల మాల్యా వంటి వ్యాపారిని పట్టితేవడం ఇప్పట్లో సాధ్యమయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాల్యా బ్యాంకులతో ఒప్పందానికి వచ్చి ఈ కేసుల నుంచి బయటపడవచ్చు. కానీ అందుక్కూడా సిద్ధపడటం లేదంటే, ఎంత కులాసాగా ఉన్నాడో అర్థమవుతున్నది.

నేరస్థుల అప్పగింత సుదీర్ఘ, సంక్లిష్ట ప్రక్రియ అని తెలిసి కూడా మాల్యా అరెస్టుకు విపరీత ప్రచారం కల్పించడం రాజకీయ ఎత్తుగడ అనే అభిప్రాయం కూడా ఉన్నది. అవినీతిని అంతమొందించాలనే పట్టుదల ఎన్డీయే ప్రభుత్వానికి ఉంటే మాల్యాను దేశం విడిచి వెళ్ళనిచ్చేది కాద నే అభిప్రాయమూ వ్యక్తమవుతున్నది. నల్లధనాన్ని విదేశాల నుంచి తెప్పిస్తామని, ఆర్థిక నేరస్థులను శిక్షిస్తామని, అవినీతిని అరికడుతామని మోదీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. మాల్యాను పట్టితేవడానికి మోదీకి ఆసక్తి ఉన్నా అది ఇప్పట్లో సాధ్యమయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందువల్ల ప్రధాని మోదీ తక్షణం చేయగలిగేది దేశంలోని ఎగవేతదారుల నుంచి సొమ్మును వసూలు చేయించడం. ప్రధాని మోదీ అధికారానికి వచ్చిన తరువాత కూడా మొండి బకాయిలు పెరిగిపోయాయి. ఇక నుంచి ఎగవేతలను అరికడుతూనే, పాతవి వసూలు చేయించాలె. నేరస్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలె. 2016 డిసెంబర్ నాటికి మొండి బకాయిలు ఏడు లక్షల కోట్ల మేర పేరుకుపోయినయి. వీటిని వసూలు చేయించడంపై దృష్టిసారిస్తే మోదీ ప్రజలకు ఇచ్చిన హామీని కొంతమేర అయినా నెరవేర్చినట్టవుతుంది.

628
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles