జీశాట్-11తో విస్తృత ఇంటర్నెట్ సేవలు

Sat,January 6, 2018 12:34 PM

Internet in rural India to get boost with GSAT 11 satellite

హైదరాబాద్: దేశంలో ఇంటర్నెట్ వాడకం పెరిగింది. గ్రామీణ భారతానికి మరింత మెరుగైన సేవలు అందించాలి. ఆ దిశగా ఇస్రో అడుగులు వేస్తున్నది. అత్యంత బరువైన జీశాట్-11 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నది. దాదాపు ఆరు టన్నులున్న జీశాట్.. నింగికి ఎగిరేందుకు సిద్దమవుతున్నది. దీన్ని ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. జీశాట్-11 భారతీయ ఇంటర్నెట్ రంగంలో పెను మార్పులు తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ భారీ శాటిలైట్‌ను ప్రస్తుతం ఫ్రెంచ్ గయానాకు తరలిస్తున్నారు. సుమారు 500 కోట్లతో తయారైన ఆ శాటిలైట్‌ను ఏరియేన్-5 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు.. భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయని నిపుణులు భావిస్తున్నారు. మరో కొన్ని వారాల్లో దీన్ని లాంచ్ చేయనున్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి జీశాట్-11 ఊతం ఇస్తుందని, ఈ ఉపగ్రహం వల్ల పంచాయతీలు, తాలూకాలు, భద్రతా దళాలకు ఇంటర్నెట్ సేవలు అందుతాయని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరన్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు ఎన్ని కమ్యూనికేషన్ శాటిలైట్లను భారత్ నింగిలోకి పంపిందో, వాటన్నింటికీ జీశాట్-11 సమానం అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ఒక్క శాటిలైట్ సుమారు 30 ఉపగ్రహాలకు సమానం అని శాస్త్రవేత్తలు తెలిపారు. జీశాట్-11 బరువు భారీగా ఉన్న కారణంగా.. ఆ బరువును మోసేందుకు ఏరియేన్-5 రాకెట్‌ను వాడుతున్నట్లు ఇస్రో వెల్లడించింది.

1743
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles