త్రివ‌ర్ణ చంద్రుడు..

Mon,July 22, 2019 03:43 PM

Indian flag to fly on Moon

హైద‌రాబాద్‌: చంద్రుడు శ్వేత‌వ‌ర్ణుడు. ప్ర‌శాంత మ‌న‌స్సుకు సంకేతం. నీట జాడ‌లున్న సోముడి వేట‌లో ఇస్రో చ‌రిత్రాత్మ‌క మైలురాయిని అందుకున్న‌ది. అగ్ర‌రాజ్యాల స‌ర‌స‌న మ‌న ఇస్రో నిలిచింది. చంద‌మామ‌పై ఇక మ‌న మువ్వ‌న్నెల త్రివ‌ర్ణ ప‌తాకం రెప‌రెప‌లాడ‌నున్న‌ది. వెయ్యి కోట్ల చంద్ర‌యాన్‌2 మిష‌న్‌ను ఇవాళ ఇస్రో విజ‌య‌వంతంగా ప్ర‌యోగించింది. భూక‌క్ష్యలోకి చంద్ర‌యాన్‌2 అనుకున్నట్లే చేరుకున్న‌ది. ఈ విష‌యాన్ని ఇస్రో చైర్మ‌న్ శివ‌న్ ద్రువీక‌రించారు. భూ క‌క్ష్య‌లోనే చంద్ర‌యాన్ 23 రోజులు భ్ర‌మిస్తుంది. ఆ త‌ర్వాతే చంద్రుడి క‌క్ష్య‌లోకి వెళ్తుంది. అన్నీ అనుకున్న‌ట్లే జ‌రిగితే.. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 7వ తేదీన జాబిలిపై విక్ర‌మ్ ల్యాండ‌ర్ దిగుతుంది. ఇక ఆ క్ష‌ణం చంద్రుడు త్రివ‌ర్ణ శోభితుడ‌వుతాడు. విక్ర‌మ్ ల్యాండ‌ర్‌పై చిన్న‌సైజు జాతీయ జెండాను ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు అమ‌ర్చారు. ఇక రోవ‌ర్‌కు చెందిన ఓ చ‌క్రంపై అశోక చ‌క్ర, మ‌రో చ‌క్రంపై ఇస్రో లోగో ఉంటుంది.
ఇవాళ జ‌రిగిన ప్ర‌యోగం .. ఇస్రో సాధించిన ఘ‌న‌త‌కు నిద‌ర్శ‌నం. జూలై 15వ తేదిన ఎగ‌రాల్సిన చంద్ర‌యాన్‌2.. సాంకేతిక లోపంతో ఆగిపోయింది. కానీ ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు ఎటువంటి దిగులు ప‌డ‌కుండా.. వారం రోజుల తేడాతోనే జీఎస్ఎల్వీ రాకెట్‌ను ప్ర‌యోగించారు. ప్ర‌పంచ దేశాల శాస్త్ర‌వేత్త‌లు ఖంగుతినే రీతిలో ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు చంద్ర‌యాన్ మిష‌న్‌ను విజ‌య‌వంతం చేయ‌డం అద్భుతం. ఎల్‌-110, ఎస్‌200 రాకెట్లు స‌రైన స‌మ‌యంలోనే ప్ర‌ధాన రాకెట్ నుంచి వేరుప‌డ్డాయి. క్ర‌యోజ‌నిక్ ఇంజిన్ కూడా అనుకున్న‌ట్లే మండింది. నేల నుంచి ఎగిరిన 16.55 నిమిషాల‌కు.. చంద్ర‌యాన్ శాటిలైట్ రాకెట్ నుంచి వేరుప‌డింది. భూక‌క్ష్య‌లోకి చేరుకున్నా.. ఇక రానున్న నెల‌న్న‌ర‌ రోజులు అత్యంత కీల‌క‌మైన‌వి. ఈ స‌మ‌యంలోనే చంద్ర‌యాన్ మిష‌న్ అనేక ఒడిదిడుకుల‌ను ఎదుర్కోనున్న‌ది.

చంద్ర‌యాన్‌2.. ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌, దేశ ప్ర‌జ‌ల మ‌నోధైర్యాన్ని చాటుతుంద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. ప్ర‌తి భార‌తీయుడు గ‌ర్వించ‌ద‌గ్గ సంద‌ర్భం అన్నారు. భార‌తీయ చ‌రిత్ర‌లోనే ఇదో అత్య‌ద్భుత సాంకేతిక విజ‌యని వివిధ రాష్ట్రాల నేత‌లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ మిష‌న్ స‌క్సెస్‌తో భార‌త్ అంత‌రిక్ష రేసులో సూప‌ర్ ప‌వ‌ర్‌గా మారింద‌న్న అభిప్రాయాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. చంద్ర‌యాన్‌2.. చంద్రుడి ద‌క్షిణ ద్రువంపై ప‌రిశోధ‌న‌లు చేప‌ట్ట‌నున్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ప్రాంతాన్ని శాస్త్ర‌వేత్త‌లు అధ్య‌య‌నం చేయ‌లేదు. తాజా ప‌రిశోధ‌న‌.. జాబిలికి సంబంధించిన అనేక కొత్త విష‌యాల‌ను వెల్ల‌డిస్తుంద‌న్న అభిప్రాయాలు క‌లుగుతున్నాయి. నీటి కోసం, ఖ‌నిజాల అన్వేష‌ణ కోసం చంద్రుడి దిశ‌గా వెళ్తున్న చంద్ర‌యాన్‌2 .. అనుకున్న ల‌క్ష్యాల‌ను సాధిస్తుంద‌ని ఆశిద్దాం.

1895
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles