ఇండియన్ ఆర్మీ మెగా ఆపరేషన్.. మయన్మార్ సరిహద్దులో మిలిటెంట్ల హతం!

Fri,March 15, 2019 05:37 PM

Indian Army conducts mega operation in India Myanmar Border

న్యూఢిల్లీ: ప్రపంచమంతా బాలాకోట్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడుల గురించి చర్చించుకుంటూ ఉంటే.. మరోవైపు ఇండియన్ ఆర్మీ సైలెంట్‌గా వెళ్లి మయన్మార్‌లో ఓ మెగా ఆపరేషన్ చేసి వచ్చింది. మయన్మార్ ఆర్మీతో కలిసి చేసిన ఈ ఆపరేషన్ ఫిబ్రవరి 17 నుంచి మార్చి 2 మధ్య జరిగింది. ఈశాన్య భారతంలో చేపడుతున్న ఓ మెగా ప్రాజెక్ట్‌కు మయన్మార్ తిరుగుబాటు గ్రూపు నుంచి ముప్పు పొంచి ఉండటంతో ఇండియన్ ఆర్మీ ఈ మెగా ఆపరేషన్ చేపట్టింది. మయన్మార్ ఉగ్రవాద సంస్థ ముద్ర వేసిన కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన అరకన్ ఆర్మీపై ఈ దాడులు జరిగాయి. ఈశాన్య ప్రాంతంలో జరుగుతున్న కాలాదన్ ప్రాజెక్ట్‌కు ఈ అరకన్ ఆర్మీ నుంచి ముప్పు పొంచి ఉంది. ఈ కాలాదన్ ప్రాజెక్ట్ ఇండియాలోని కోల్‌కతాను, మయన్మార్‌లోని సిట్వె పోర్ట్‌ను కలుపుతుంది. మధ్యలో ఈశాన్య రాష్ట్రం మిజోరం గుండా ఈ ప్రాజెక్ట్ వెళ్తున్నది. దీని కారణంగా కోల్‌కతా, మిజోరం మధ్య వెయ్యి కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇక ప్రయాణ సమయం నాలుగు రోజులు తగ్గనుండటం విశేషం.

అలాంటి ఈ కాలాదన్ ప్రాజెక్ట్‌కు అరకన్ ఆర్మీ నుంచి ముప్పు ఉందన్న నిఘా వర్గాల హెచ్చరిక మేరకు ఇండియన్ ఆర్మీ ఈ భారీ ఆపరేషన్‌ను చేపట్టింది. మిజోరం సరిహద్దులో అరకన్ ఆర్మీ కొత్తగా వేసుకున్న క్యాంప్‌లపై దాడి చేశారు. ఇండియన్ ఆర్మీకి చెందిన ప్రత్యేక బలగాలు, అస్సామ్ రైఫిల్స్, ఇతర యూనిట్లు కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్లు, ఇతర నిఘా వ్యవస్థలను కూడా ఇండియన్ ఆర్మీ వాడుకుంది. మయన్మార్‌లో ఉన్న కచిన్ రాష్ట్రంలో ఈ కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ ఉంటుంది. ఇది గత రెండేళ్లలో 3 వేల మందిని దాడుల కోసం సిద్ధం చేసింది. ఐఈడీలు పెట్టడంలోనూ ఈ అరకన్ ఆర్మీ ప్రత్యేకంగా శిక్షణ పొందటంతో కాలాదన్ ప్రాజెక్ట్‌కు పెను ముప్పు పొంచి ఉందని ఇండియా, మయన్మార్ భావించాయి. ఈ కచిన్ రాష్ట్రం సున్నితమైన ఇండియా, చైనా, మయన్మార్ సరిహద్దుల్లో ఉంటుంది. ఇక్కడే ఇండియన్ ఆర్మీ పదుల సంఖ్యలో మిలిటెంట్ల క్యాంప్‌లను పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్‌కు ఇండియా, మయన్మార్ ఆర్మీలు రెండు నెలల కిందటే ప్రణాళికలు రచించాయి.

3214
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles