పాక్‌కు బుద్ధి చెప్ప‌డానికి చాలా మార్గాలున్నాయ్‌: ఆర్మీ చీఫ్‌

Wed,June 28, 2017 11:39 AM

India has more effective options to teach Pakistan a lesson says Army chief

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాలంటే స‌ర్జిక‌ల్ దాడులే కాదు.. త‌మ ద‌గ్గ‌ర చాలా మార్గాలు ఉన్నాయ‌ని ఆర్మీ చీఫ్ బిపిన్ రావ‌త్ స్ప‌ష్టంచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్య‌లో ఆయ‌న కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. చాలా ఈజీగా యుద్ధం చేస్తూ.. ఫ‌లితాలు సాధిస్తున్నామ‌ని పాకిస్థాన్ భావిస్తూ ఉండొచ్చు. కానీ మా ద‌గ్గ‌ర చాలా మార్గాలున్నాయి. వాటి వ‌ల్ల పాక్‌పై చాలా ప్ర‌భావం ప‌డుతుంది. మ‌న ఆర్మీ అంత అనాగ‌రికంగా వ్య‌వ‌హ‌రించ‌దు. వాళ్ల‌లాగా త‌ల‌లు లెక్క‌పెట్టం అని రావ‌త్ అన్నారు. ఇద్ద‌రు జ‌వాన్ల‌ను పాక్ ముక్క‌లుగా న‌రికిన తీరుపై బిపిన్ ఇలా స్పందించారు. ఇక హిజ్బుల్ చీఫ్ స‌లాహుద్దీన్‌ను అమెరికా అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా గుర్తించ‌డంపై మాట్లాడుతూ.. దీనిపై పాకిస్థాన్ స్పంద‌న కోసం ఎదురుచూస్తాన‌ని చెప్పారు. అయినా దీనివ‌ల్ల పెద్ద‌గా ఒరిగేదేమీ లేద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇక క‌శ్మీరీ నేత‌ల‌తో చ‌ర్చ‌ల‌పై స్పందిస్తూ.. ముందు అక్క‌డ శాంతి నెల‌కొన్న త‌ర్వాతే చ‌ర్చ‌లుంటాయ‌ని స్ప‌ష్టంచేశారు. ఆర్మీకి చాలా ప‌ని ఉంది. అక్క‌డ శాంతి నెల‌కొల్పాల్సిన అవ‌స‌రం ఉంది. మా కాన్వాయ్‌ల‌పై రాళ్ల దాడి ఎప్పుడు ఆగుతుందో ఆ రోజు నేనే చ‌ర్చ‌లు మొద‌లుపెడ‌తాను అని బిపిన్ స్ప‌ష్టంచేశారు. క‌శ్మీరీ యూత్‌ను త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నార‌ని, అక్క‌డి యువ‌నేత‌ల‌తో మాట్లాడ‌టానికి తాము ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని తెలిపారు. ఇక మేజ‌ర్ ఎన్ఎల్ గొగోయ్ ఆర్మీ జీప్‌న‌కు మానవ క‌వ‌చాన్ని వాడ‌టాన్ని మ‌రోసారి బిపిన్ స‌మ‌ర్థించారు. ఈ సంద‌ర్భంగా శ్రీన‌గ‌ర్ మ‌సీదు బ‌య‌ట డీఎస్పీని కొట్టి చంపిన ఉదంతాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ఆ రోజు ఎన్నిక‌ల సంఘం సిబ్బంది జీపులో ఉన్నారు. వాళ్ల‌పై ఈ దాడి జ‌రిగి ఉంటే ఏం జ‌రిగేది? అందుకే అక్క‌డి ప‌రిస్థితిని బ‌ట్టి మా వాళ్లు ఏం చేసినా ఆమోదిస్తాను అని బిపిన్ స్ప‌ష్టంచేశారు.

1157
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles