దేశంలో అత్యంత కాలుష్య నగరాలు ఇవే!

Thu,February 14, 2019 12:28 PM

IIT Kanpur lists three most polluted cities in India

న్యూఢిల్లీ: దేశంలో కాలుష్య నగరాల జాబితా రోజురోజుకూ ఎక్కువవుతున్నది. రాజధాని ఢిల్లీ నగరం ఈ కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. అయితే ఢిల్లీని మించిన కాలుష్య నగరాలు కూడా ఉండటం విశేషం. ఇవి కూడా ఉత్తర భారతంలోనే ఉన్నాయి. ఐఐటీ-కాన్పూర్, శక్తి ఫౌండేషన్ సంయుక్తంగా ఈ అధ్యయనం చేశాయి. ఇందులో బీహార్ రాజధాని పాట్నా తొలి స్థానంలో ఉండగా.. యూపీలోని కాన్పూర్, ప్రధాని మోదీ లోక్‌సభ నియోజకవర్గం వారణాసి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అసలు అన్నింటికన్నా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. గతేడాది చైనా కంటే ఇండియాలోనే 50 శాతం ఎక్కువ కాలుష్యం నమోదవడం. అక్టోబర్-నవంబర్ మధ్య 45 రోజులపాటు ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో ఈ మూడు నగరాల్లో 31 రోజుల పాటు తీవ్రమైన వాయు కాలుష్యం నమోదైనట్లు గుర్తించారు. గాల్లో పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం) 2.5గా నమోదైంది. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీసే స్థాయి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే పాట్నాలో ఈ స్థాయి కాలుష్యానికి కారణం శీతాకాలమని బీహార్ పర్యావరణ శాఖ మంత్రి సుశీల్ మోదీ చెప్పారు. కాలుష్యాన్ని తగ్గించడానికి ఓ ప్రణాళిక రూపొందించామని, త్వరలో దానిని అమలు చేస్తామని తెలిపారు. గంగా నది సిటీకి దగ్గరగా ఉండటం వల్ల కూడా అవసరమైన పర్యావరణ ప్రమాణాలను సాధించలేకపోతున్నట్లు ఆయన చెప్పారు. ఇలాంటి నదుల వల్ల నగరాలు త్వరగా కాలుష్యం బారిన పడతాయి. పాట్నా దగ్గర కూడా ఇలాంటి కాలుష్యమే ఉంది. గాలులు వీచినపుడు పెద్ద ఎత్తున దుమ్ము దూళి నగరంలోకి వస్తున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్య తీవ్రంగా ఉంటున్నది అని సుశీల్ మోదీ చెప్పారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ ఈ లిస్ట్‌లో నాలుగోస్థానంలో ఉండటం విశేషం. అయితే కాలుష్యాన్ని నియంత్రించడానికి భారత్ కంటే చైనా మెరుగైన చర్యలు తీసుకుంటున్నదని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ త్రిపాఠి చెప్పారు. అంతర్జాతీయ నిపుణులు కూడా ఇదే రకమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం, వాతావరణ మార్పులు, ఆరోగ్యం మధ్య ఉన్న లింకును భారత్ చూడాలని వాళ్లు చెబుతున్నారు.

2493
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles