షాకింగ్.. బ్యాడ్మింటన్ లాకర్లలో వందల కోట్ల డబ్బు!

Mon,July 23, 2018 04:05 PM

Hundreds of crores of cash and property documents found in Badminton club lockers in Bangalore

బెంగళూరు: అదో ప్రతిష్టాత్మకమైన బ్యాడ్మింటన్ క్లబ్. పేరు బోరింగ్ క్లబ్. అక్కడి లాకర్లలో తమ క్రీడాసామాగ్రి పెట్టుకోవడానికి సభ్యత్వం కూడా ఇస్తారు. ప్రతి ఏడాది లాకర్ తీసుకున్న సభ్యుడు తన సభ్యత్వాన్ని పొడిగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఓ సభ్యుడు మాత్రం అలా చేయలేదు. ఎన్నోసార్లు క్లబ్ నిర్వాహకులు అతన్ని కోరినా.. పట్టించుకోలేదు. దీంతో అతని లాకర్లను మరొకరికి ఇవ్వాలని నిర్ణయించిన నిర్వాహకులు.. అతనికి చెందిన మూడు లాకర్లను తెరిచారు. అందులో ఉన్న వస్తువులు చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు.

బెంగళూరు నగరానికి చెందిన ఓ చిన్న వ్యాపారవేత్త అవినాశ్ అమర్‌లాల్ కుఖ్రేజాకు చెందిన లాకర్లవి. అందులో రూ.3.96 కోట్ల నగదు, రూ.8 కోట్ల విలువైన వజ్రాలు, ఆభరణాలు, రూ.800 కోట్ల విలువైన బ్లాంక్ చెక్కులు, ఇతర ఆస్తుల డాక్యుమెంట్లు ఉన్నాయి. వాటిని చూసి షాక్ తిన్న క్లబ్ నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులకు వాటిని అప్పగించారు. అదే సమయానికి అవినాశ్ తన వస్తువులు తీసుకోవడానికి క్లబ్‌కు వచ్చాడు. కావాలంటే డబ్బు మొత్తం తీసుకొని, ఆస్తుల పత్రాలు మాత్రం తనకు ఇవ్వాలని అవినాశ్ తన కాళ్ల మీద పడినట్లు క్లబ్ సెక్రటరీ వెల్లడించారు.

కొంతసేపటి తర్వాత మరో వ్యక్తి వచ్చి.. అందులోని ముఖ్యమైన ఒక డాక్యుమెంట్ కోసం రూ.5 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించగా.. అతడు కూడా కాళ్లపై పడ్డాడు. శుక్రవారం ఈ ఘటన జరిగింది. శనివారం సాయంత్రానికి ఐటీ అధికారులు వాటి మొత్తం విలువను లెక్క కట్టారు. ఈ ఘటన తర్వాత నగరంలోని ప్రముఖ క్లబ్‌లన్నీ తమ లాకర్లలో సభ్యులు ఏం దాచుకున్నారో తేల్చుకునే పనిలో పడ్డాయి. తమ క్రీడా సామాగ్రిని పెట్టుకోవడానికి వాడుకోవాల్సిన ఈ లాకర్లలో కోట్లకొద్దీ సొమ్ము పెట్టుకోవడం షాక్‌కు గురిచేసింది. ఇలాంటి ఘటనల వల్ల మా క్లబ్ ప్రతిష్ట దెబ్బతింటుంది అని బోరింగ్ క్లబ్ గౌరవ కార్యదర్శి హెచ్‌ఎస్ శ్రీకాంత్ చెప్పారు.

అవినాశ్‌కు మరో క్లబ్‌లో సభ్యత్వం ఉండటంతో ఐటీ అధికారులు అక్కడి లాకర్లలో సోదాలు చేసినా.. అక్కడ ఏమీ దొరకలేదు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వెయ్యి కోట్లు ఉన్న ఆ ఆస్తుల పత్రాలు చూసి నగరం ఉలిక్కిపడింది. రాష్ట్రంలోని పేరున్న రాజకీయ నాయకుల బినామీ పత్రాలను అవినాశ్ తన దగ్గర పెట్టుకున్నట్లు అవినాశ్‌తో సంబంధాలున్న ఇతర వ్యాపారవేత్తలు వెల్లడించారు. కొన్నేళ్లుగా అవినాశ్ హవాలా వ్యాపారం కూడా చేస్తున్నట్లు మరికొందరు ఆరోపించారు. బ్లాంక్ చెక్కులు, ఆస్తుల పత్రాలు తీసుకొని కోట్ల కొద్దీ డబ్బును అతడు అప్పుగా ఇస్తాడు.

అతని దగ్గర డబ్బు తీసుకున్నవాళ్లలో అధికారులు, రియల్ ఎస్టేట్, రాజకీయనాయకులు కూడా ఉన్నారు అని ఓ ఐటీ అధికారి చెప్పారు. అవినాశ్ బెంగళూరులో ఓ టైర్ల షోరూమ్‌ను నడుపుతున్నాడు. అతని పూర్వీకులు.. 1947లో దేశ విభజన తర్వాత ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న సింధ్ ప్రావిన్స్ నుంచి బెంగళూరు వచ్చి స్థిరపడ్డారు. అతని తండ్రి కూడా బెంగళూరులో బడా పారిశ్రామికవేత్త.

3647
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles