అశ్రునయనాల మధ్య జర్నలిస్ట్ బుఖారి అంత్యక్రియలు

Fri,June 15, 2018 02:36 PM

Hundreds bid farewell to slain journalist Shujaat Bukhari

శ్రీనగర్ : రైజింగ్ కశ్మీర్ దినపత్రిక ఎడిటర్ షుజాత్ బుఖారి(53) అంత్యక్రియలు అభిమానులు, జర్నలిస్టుల అశ్రునయనాల నడుమ సాగాయి. బుఖారి అంత్యక్రియల్లో వందలాది మంది పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. బారాముల్లా జిల్లాలోని బుఖారి పూర్వీకుల నివాసంలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ఆయనను ఖననం చేసే ముందు బుఖారి భౌతికకాయానికి నివాళులర్పిస్తూ బారముల్లా వీధుల్లో అంతిమయాత్ర నిర్వహించారు.

బుఖారిని హత్య చేసిన ముగ్గురు నిందితుల ఫోటోలను కశ్మీర్ పోలీసులు ఇవాళ విడుదల చేశారు. బుఖారిని హత్య చేసిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించి.. నిందితులను కనిపెట్టే ప్రయత్నంలో పోలీసులు పడ్డారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు నిందితులు బైక్‌పై వెళ్తున్న ఫోటోలను పోలీసులు రిలీజ్ చేశారు. ఈ ముగ్గురిని సాధారణ ప్రజలు గుర్తుపడితే సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

షుజాత్ బుఖారి గురువారం సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొనడానికి వెళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఈ కాల్పుల్లో ఆయన భద్రతా అధికారులు ఇద్దరు కూడా మరణించారు. ఈ సంఘటన జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో చోటుచేసుకుంది. రంజాన్ పండుగ నేపథ్యంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడానికి బుఖారి పత్రికా కార్యాలయం నుంచి బయటికి వచ్చారు. ఆయన కూర్చున్న కారు కొద్దిదూరం ప్రయాణించగానే బైక్‌పై వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు తుపాకులతో కాల్పులు జరిపారు. దీంతో బుఖారి కారు సీట్లోనే ప్రాణాలు విడిచారు. చాలా దగ్గరి నుంచి కాల్పులు జరుపడం, పలు బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లడంతో క్షణాల్లో ఆయన మృతిచెందారు. బుఖారి వెంట ఉన్న ఇద్దరు సెక్యూరిటీ అధికారులు కూడా ఈ ఘటనలో మరణించారు.

బుఖారి గతంలో హిందూ దినపత్రికలో కశ్మీర్ కరస్పాండెంట్‌గా పనిచేశారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులను నెలకొల్పడానికి విశేషంగా కృషి చేశారు. పలు సమావేశాలను, చర్చావేదికలను ఏర్పాటు చేశారు. శాంతి కోసం ఆయన చేస్తున్న కృషి ఉగ్రవాదులకు కంటగింపుగా మారింది. 2000 సంవత్సరంలో కూడా బుఖారిపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అప్పటి నుంచి ప్రభుత్వం ఆయనకు భద్రతను కల్పిస్తున్నది. ఇది పక్కాగా ప్లాన్‌తో చేసిన హత్యేనని పోలీసులు చెప్పారు. బుఖారి హత్యను జమ్ముకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, పలు పత్రిక సంఘాలు, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించాయి.

1250
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles