రూ.11కోట్ల హవాలా సొమ్ము స్వాధీనం

Sun,December 2, 2018 01:18 PM

Hawala racket busted in Chennai, Rs 11 crore seized

చెన్నై: చెన్నైలో ఓ హోటల్‌లో నిర్వహించిన సోదాల్లో 7 కిలోల బంగారం, 11 కోట్ల రూపాయల హవాలా సొమ్మును చెన్నై రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నైకి చెందిన ఒక పారిశ్రామికవేత్త మైలాపూర్‌లో ఉన్న ప్రముఖ హోటల్లో విదేశీ వ్యక్తుల నుంచి హవాలా సొమ్మును తీసుకోనున్నట్టు రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ పోలీసులకు సమాచారం అందింది. ఆ హోటల్లో గురువారం ఇంటెలిజెన్స్‌ పోలీసులు తనిఖీలు చేశారు. ఆ సమయంలో హోటల్లో నుంచి పార్కింగ్‌ చోటుకు వెళ్లిన ఓ పారిశ్రామికవేత్త తన చేతిలో ఒక తోలు సంచి కలిగి ఉన్నాడు.

ఆ బ్యాగును తనిఖీచేయగా అందులో విదేశాల నుంచి తీసుకువచ్చిన ఒక కిలో బరువున్న ఆరు బంగారు బిస్కెట్లు ఉన్నట్టు గుర్తించారు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారించగా, ఆ హోటల్లో బసచేసి ఉన్న విదేశీయుల నుంచి ఆ బంగారు బిస్కెట్లను పొందినట్టు అంగీకరించాడు. దీంతో పోలీసులు ఆ హోటల్లో ఉన్న ఇద్దరు విదేశీయులను అరెస్టు చేసి విచారించగా, ఒకరోజు క్రితమే తాము దక్షిణ కొరియా నుంచి వచ్చినట్లు, తామే ఆ బంగారు బిస్కెట్లను చెన్నై విమానాశ్రయంలో అధికారుల కళ్లుగప్పి తీసుకువచ్చినట్టు చెప్పారు. అనంతరం వారు ఇచ్చిన సమాచారం మేరకు చెన్నై నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం చెన్నై రెవెన్యూ ఇంటలిజెన్స్‌ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

ఆ సమయంలో ఒక దుస్తుల దుకాణ వ్యాపారిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి ఒక కిలో బంగారు బిస్కెట్‌ ఒకటి, రూ.5.16 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ దుకాణంలో పనిచేస్తున్న సిబ్బంది ఇళ్ల నుంచి రూ.6 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా బంగారు బిస్కెట్లు హవాలా నగదు తరలింపునకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అదే విధంగా హవాలా సొమ్ము తరలించడానికి ఉపయోగించిన ఒక కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నారు.

1435
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles