కొబ్బరినూనె విషమన్న హార్వర్డ్ ప్రొఫెసర్

Wed,August 22, 2018 08:31 PM

harvard professor says coconut oil is poison

ఆరోగ్యస్పృహ పెరిగేకొద్దీ రకరకాల ఆహార పదార్థాలు ప్రచారం పొందుతున్నాయి. మధుమేహం తగ్గుతుందని, ఇంకా ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఈ మధ్య కొబ్బరినూనెకు విపరీతమైన ప్రచారం లభిస్తున్నది. రకరకాల సూపర్ డయెట్లలో దీనిని జోడిస్తున్నారు. కేరళీయులు కొబ్బరి నూనెను ఎప్పటినుంచో వాడుతున్నారు. మిగతా ప్రాంతాలవారికి ఈ నూనె అంతగా అలవాటు లేదు. ఇప్పుడు కొబ్బరినూనెను ఆరోగ్యప్రదాయినిగా ప్రోత్సహిస్తున్నారు. వెంట్రుకలు రాలడం నుంచి మానసిక ఆందోళన వరకు, ఊబకాయం నుంచి అరిశెమొలల దాకా అన్నిటికీ సర్వరోగనివారిణిగా కొబ్బరినూనెను ముందుకు తెస్తున్నారు. అయితే కొబ్బరినూనె శుద్ధవిషమని హార్వర్డ్ ప్రొఫెసర్ కారిన్ మిషెల్స్ హెచ్చరిస్తున్నారు. శరీరానికి విషమెంత మేలు చేస్తుందో.. ఇదీ అంతే చేస్తుందని ఆమె నొక్కిచెప్తున్నారు. యూనివర్సిటీ ఆప్ ఫ్రీబుర్గ్‌లో ఇటీవల ఆమె కోకోనట్ ఆయిల్ ఇతర పోషక తప్పిదాలు అనే శీర్షికతో ప్రసంగం చేశారు. ఆమె జర్మనీ భాషలో చేసిన ఆ ప్రసంగం ఇప్పటిదాకా యూట్యూబ్‌లో పదిలక్షల సార్లు చూశారు. కొబ్బరినూనంలో ఉండే గాఢమైన కొవ్వు ప్రమాదకరమైన ఎల్డీఎల్ పరిమామాన్ని పెంచుతుందని ప్రొఫెసర్ మిషెల్ హెచ్చరించారు.

సమతుల ఆహారంలో కొబ్బరినూనెను కొద్ది మోతాదులో తీసుకుంటే ఫరవాలేదని, శ్రుతిమించితే హృద్రోగాలు తప్పవని ఆమె తెలిపారు. కొబ్బరినూనె తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యపరమైన మేలు ఏమిటో ఇంతవరకు శాస్త్రీయంగా రుజువు కాలేదని పేర్కొన్నారు. దేశదేశాల్లో కొబ్బరినూనెను ప్రోత్సహిస్తుండడంతో సూపర్‌మార్కెట్లలో ఈ నూనె కొరకు ప్రత్యేకకౌంటర్లు పెడుతున్నారు. బ్రిటన్‌లో గత నాలుగేండ్లలో అమ్మకాలు 16 రెట్లకు పైగా పెరిగాయి. కొబ్బరినూనెలో 86 శాతం సాంద్రతరమైన కొవ్వు ఉంటుందని, ఇది వెన్నకన్నా మూడోవంతు ఎక్కువని ప్రొఫెసర్ మిషెల్స్ ఉటంకించారు. సాంద్రమైన కొవ్వు వల్ల రక్తంలో ఎల్డీఎల్ పెరిగి గండెజబ్బులు, స్ట్రోక్ రావడం అనేది నిర్ధారణ అయిన విషయమని చెప్పారు. కొబ్బరినూనె రుచిని ఇష్టపడేవారు కావాలంటే అతితక్కువ మోతాదులోనే వాడాలని ప్రొఫెసర్ మిషెల్ స్పష్టం చేశారు.

8927
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS