కాంగ్రెస్‌కు హార్థిక్ పటేల్ డెడ్‌లైన్

Sat,November 18, 2017 03:56 PM

Hardik Patel Group Delivers New Ultimatum To Congress

న్యూఢిల్లీ : పటేళ్ల ఉద్యమ సారథి హార్థిక్ పటేల్ వర్గం కాంగ్రెస్ పార్టీకి 24 గంటల డెడ్‌లైన్ విధించింది. పటేళ్ల రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఒకరోజు గడువు విధించింది. కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానం మేరకు హార్థిక్ వర్గమైనటువంటి PAAS(పటిదార్ అనామత్ అందోళన్ సమితి) నేతలు నలుగురు శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. పటేళ్ల రిజర్వేషన్ అంశపై చర్చించాలని కాంగ్రెస్ తమను ఢిల్లీకి పిలిచిన‌ట్లు నలుగిరిలో ఒకరైన దినేష్ బుంభాడియా మీడియాకు వెల్లడించారు.

పటేల్ కమ్యూనిటీకి రిజర్వేష్ కోటా ఇవ్వడానికి రోడ్‌మ్యాప్‌ను తయారు చేయాలని కాంగ్రెస్ పార్టీ తమను పిలిచినట్లు బుంభాడియా చెప్పారు. అయితే.. ఢిల్లీలోని గుజరాత్ భవన్ వద్ద రోజంతా ఎదురు చూశామని ఎవరూ తమతో చర్చించలేదన్నారు. అందుకే 24 గంటల గడువు విధించినట్లు వెల్లడించారు. కోటాపై స్ఫష్టమైన హామీ ఇస్తేనే కాంగ్రెస్‌కు పటేళ్ల మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు.

హార్థిక్ పటేల్ వర్గం కాంగ్రెస్‌కు డెడ్‌లైన్ విధించడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ఎన్నోసార్లు ఇలాంటి కండీషన్లు పెట్టింది. ఎలక్షన్లు దగ్గరపడుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సీట్లకోసమే హార్థిక్ డెడ్‌లైన్ వ్యూహాన్ని పన్నారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎలక్షన్లలో పటేళ్లు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలంటే తన వర్గానికి 30 సీట్లు కేటాయించాలని హార్థిక్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. 30 మంది పేర్లతో కూడిన జాబితాను ఢిల్లీకి పంపినట్లు తెలుస్తున్నది. పటేళ్ల రిజర్వేషన్ అంశం గుజరాత్ ఎన్నికల్లో అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. పటేళ్లను దగ్గరకు తీసుకుని బయట పడాలని భావిస్తున్న కాంగ్రెస్ సీట్ల కేటాయింపు డిమాండ్‌తో కాస్త ఇబ్బంది పడుతున్నది. మొదటి విడత ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మంగళవారమే కావడంతో కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా నిర్ణయం తీసుకోలేకపోతున్నది.

2063
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles