ఆ పోకిరీలతోనే మళ్లీ హంపి స్తంభాలను నిలబెట్టించారు

Wed,February 20, 2019 06:32 PM

hampi vandasls made to re-instal fallen pillars

హంపిలో స్తంభాలను పడగొట్టిన పోకిరీలు పట్టుబడ్డారు. వారు హంపి శిథిలాల్లో తిరుగుతూ రెచ్చిపోయారు. పాతకాలపు స్తంభాలను పడదోశారు. తామేదో ఘనకార్యం చేస్తున్నట్టు ఆ చిల్లరపనిని వీడియో తీసుకున్నారు. ఏతావాతా ఆ వీడియో సోషల్ మీడియా ద్వారా వైరల్ అయింది. ప్రజల ఆగ్రహం ఫలితంగా ప్రభుత్వం చర్యలు చేపట్టక తప్పని పరిస్థితి వచ్చింది. ఎట్టకేలకు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వారిని దోషులుగా తేల్చిన కర్నాటక న్యాయస్థానం సినిమా తరహా శిక్ష విధించింది. స్తంభాలను పడగొట్టినవారే వాటిని తిరిగి నిలబెట్టాలి. అదీ పోలీసుల సమక్షంలో. అంతేకాకుండా 70 వేల జరిమానా కూడా వేసింది. మంగళవారం ఈ తీర్పు వెలువడింది. పోలీసులు ఆమేరకు దోషులను హంపీ శిథిలాల వద్దకు తీసుకువెళ్లి స్తంభాలను యథావిధిగా నిలబెట్టించారు. నెటిజనుల ఆగ్రహం ఫలితంగా ఈ కేసు ఓ కొలిక్కి రావడం గమనార్హం. వీడియో వైరల్ అయినప్పుడు యునెస్కో వారసత్వ సంపదగా భావించే హంపిలో ఇలాంటి ఘోరాలు చోటుచేసుకోవడమా? అని ఆగ్రహావేశాలు వక్తమయ్యాయి. వ్యవహారం ధర్నాల దాకా పోయింది. దీంతో ప్రభుత్వం మేల్కొంది. నిజానికి ఆ వీడియో ఇప్పటిది కాదు. ఓ ఏడాది క్రితం నాటిది. ఏమైతేనేం.. ఆ వీడియో కదలిక తెచ్చింది. హడావుడిగా కన్నడ సర్కారు హంపి శిథిలాల భద్రతను సమీక్షించింది. హంపి శిథిలాల పరిరక్షణ బాధ్యత కేంద్ర ప్రభుత్వ విభాగమైన ఆర్కెలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక నిర్వహణను మాత్రమే చూసుకుంటుంది. 14వ శతాబ్దానికి చెందిన హంపి శిథిలాలు 4100 హెక్టార్లలో పరచుకుని ఉన్నాయి. సుమారు 1600 నిర్మాణాలు అందులో ఉన్నాయి. అంతంత మాత్రంగా ఉన్న సిబ్బందితో శిథిలాల రక్షణ తగిన రీతిలో నిర్వహించలేమని కర్నాటక టూరిజం విభాగం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం శిథిలాల పరిరక్షణకు హంపీ ప్రపంచ వారసత్వ ప్రాంత నిర్వహణా ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ వల్ల సంపూర్ణ పరిరక్షణ సాధ్యం కాదని ఆకతాయిల వీడియోతో తేలిపోయింది. అలాగని శిథిలాల చుట్టూ ఇనుపకంచె ఏర్పాటు చేయాడం కూడా సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే స్థానికులు పొలాలకు వెళ్లిరావడం, చిన్న వ్యాపారుల కదలికకు దానివల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. అంతటా సెక్యూరిటీ గార్డులను పెట్టడం కూడా సాధ్యం కాదు కనుక కనీసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. హంపిలోని సుప్రసిద్ధ విష్ణు ఆలయం వద్ద మాత్రం ఇద్దరు కానిస్టేబుళ్లను, ఇద్దరు రోజుకూలీలను భద్రతకు నియమించారు.

2506
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles