ప్రధాని మోదీని ఆకట్టుకున్న రాఫెల్ వెడ్డింగ్ కార్డ్

Tue,January 22, 2019 02:54 PM

సూరత్: రాఫెల్ డీల్.. కొన్ని రోజులుగా ఈ డిఫెన్స్ డీల్‌ను వాడుకొని మోదీ సర్కార్‌ను కాంగ్రెస్ తెగ ఇబ్బంది పెడుతున్నది. అనిల్ అంబానీ కంపెనీకి అక్రమంగా వేల కోట్లు దోచి పెట్టడానికే మోదీ డీల్ పేరుతో కుంభకోణానికి పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. దీనిని బీజేపీ కూడా గట్టిగానే తిప్పికొడుతున్నది. అయితే ఈ రాఫెల్ డీల్‌ను సమర్థిస్తూ గుజరాత్‌లోని ఓ యువ జంట తమ పెళ్లి పత్రికను తయారు చేయడం ప్రధాని మోదీనే ఆకట్టుకున్నది. తమ వెడ్డింగ్ కార్డ్‌లో ప్రత్యేకంగా ఓ పేజీనే కేటాయించి రాఫెల్ డీల్‌ను సమర్థిస్తూ కొన్ని అంశాలను ముద్రించారు. ఈ కార్డు చూసి తెగ సంతోషించిన మోదీ.. సదరు యువ జంట యువరాజ్ పోఖర్నా, సాక్షి అగర్వాల్‌లను అభినందిస్తూ ఓ లేఖ రాశారు.

కార్డు చాలా అద్భుతంగా ఉన్నదని, ఇది చూసిన తర్వాత దేశం కోసం మరింత కష్టపడి పని చేయాలని తనకు అనిపించినట్లు ఆ లేఖలో మోదీ పేర్కొన్నారు. జనవరి 17న ఈమెయిల్ ద్వారా ఈ లేఖను వరుడు యువరాజ్ తల్లి బబితా ప్రకాశ్‌కు మోదీ పంపించారు. రాఫెల్ డీల్‌కు సంబంధించిన కొన్ని నిజాలు అంటూ ఈ జంట తమ వెడ్డింగ్ కార్డులో డీల్‌ను సమర్థించారు. అందులో తొలి వరుసలోనే సాధారణ ఎయిర్‌క్రాఫ్ట్‌కు, అన్ని రకాలుగా ఆయుధాలు సమకూర్చిన ఎయిర్‌క్రాఫ్ట్‌కు మధ్య ధరలను ఓ మూర్ఖుడు కూడా పోల్చి చూడలేడు అని ఆ జంట అభిప్రాయపడింది. కాంగ్రెస్ డీల్ కంటే 20 శాతం తక్కువకే రాఫెల్ జెట్స్‌ను మోదీ సర్కార్ కొనుగోలు చేస్తున్నదని వివరించారు. ఏకంగా మోదీయే తమ కార్డును మెచ్చుకుంటూ లేఖ రాయడంతో ఆ వరుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

1920
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles