
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి: కట్నం ఆలస్యమైందని వరుడు పెళ్లికి నిరాకరించాడు. ఎంత మొరపెట్టుకున్నా కనికరం చూపకపోవడంతో వధువు కుటుంబ సభ్యులు ఠాణాలో ఫిర్యాదుచేశారు. దీంతో వరుడు, ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ ఘటన వీర్నపల్లి మండల కేంద్రంలో వెలుగుచూసింది. ఎస్ఐ లాలమురళి కథనం ప్రకా రం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జనగాంకు చెందిన భీముని సంపత్ హైదరాబాద్‌లో హెటిరో హెల్త్‌కేర్‌లో హెచ్ఆర్గా పనిచేస్తున్నాడు. వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ యువతితో సంపత్‌కు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. వధువు తల్లిదండ్రులు 10లక్షల కట్నం, లాంఛనాలు అందిస్తామని ఒప్పందం చేసుకున్నారు. నిశ్చితార్థం రోజున 50వేల నగదును అందజేశారు. పెళ్లి రోజున బంగారం, మిగతా కట్నం అందిస్తామని తెలిపి ఈ నెల 10న వివాహానికి మూహూర్తం నిర్ణయించారు.
అనుకున్న సమయానికి కట్నం ఇవ్వకపోవడంతో వరుడు సంపత్, తండ్రి తిరుపతి, తల్లి పద్మ పెళ్లికి నిరాకరించారు. దీంతో వధువు కుటుంబీకులు బంగారం ఖరీదుపోను మిగతా 6లక్షల నగదును, గ్రామపెద్దలతో కలిసి వరుడి ఇంటికి వెళ్లారు. అయినప్పటికీ కట్నం ఆలస్యమైందనీ, ఈ పెళ్లి వద్దని వారు తెగేసి చెప్పారని వధువు బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై వధువు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వరుడు, అతడి కుటుంబీకులపై చర్యలు తీసుకోవాలని వీర్నపల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు. వరుడు భీముని సంపత్, తండ్రి తిరుపతి, తల్లి పద్మ, అన్న భీముని రాజేశ్, తమ్ముడు భీముని వినయ్, ప్రత్యూషపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లాల మురళి వెల్లడించారు.