బల నిరూపణ.. ఎన్ని రోజులన్నది ఎలా నిర్ణయిస్తారు?

Thu,May 17, 2018 03:16 PM

బెంగళూరు: ఇప్పుడు దేశమంతా కర్ణాటకవైపే చూస్తున్నది. కాంగ్రెస్, జేడీఎస్‌లకు మెజార్టీ సభ్యుల మద్దతు ఉన్నా.. అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వాజుభాయ్ వాలా మొగ్గుచూపారు. బల నిరూపణకు 15 రోజుల సమయం కూడా ఇచ్చారు. దీనిపై ఎన్నో విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఎంత సమయం ఇవ్వాలి అన్నది ఎలా నిర్ణయిస్తారు అన్న ప్రశ్న తలెత్తింది. గతంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తినపుడు ఇటు రాష్ట్రంలో గవర్నర్లు, అటు కేంద్రంలో రాష్ట్రపతులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం.


నిజానికి బల నిరూపణకు సమయం ఇవ్వడమన్నది గవర్నర్, రాష్ట్రపతి విచక్షణాధికారం. కచ్చితంగా ఇన్ని రోజులే ఇవ్వాలన్న నిబంధన ఏదీ లేదు. గతంలో కనిష్ఠంగా రెండు రోజుల నుంచి గరిష్ఠంగా నెల రోజుల వరకు గడువు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా గోవాలో ఇలాంటి పరిస్థితే ఏర్పడినపుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని పారికర్ ప్రభుత్వానికి నాలుగు రోజుల సమయం ఇచ్చింది. సాధారణంగా అధికారంలోకి ఉన్న ప్రభుత్వాలకు సాధ్యమైనంత త్వరగా బల నిరూపణ చేసుకోవాలని ఆదేశిస్తారు.

1996లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ వాజ్‌పేయి ప్రభుత్వానికి బల నిరూపణ కోసం 15 రోజుల గడువిచ్చారు. మే 16న ప్ర‌మాణ‌స్వీకారం చేసిన వాజ్‌పేయికి మే 31 వ‌ర‌కు గ‌డువు ఉన్నా.. అంత‌వ‌ర‌కు వేచి చూడ‌కుండా ముందుగానే త‌ప్పుకున్నారు. ఇక 1998లో ఇదే వాజ్‌పేయి ప్రభుత్వానికి అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ పది రోజుల సమయం ఇచ్చారు. అప్పట్లో చరణ్‌సింగ్ ప్రభుత్వానికి అత్యధికంగా నెల రోజుల సమయం ఇచ్చినా.. బల నిరూపణకు ముందే ఆయన తప్పుకున్నారు.

ఆ తర్వాత వీపీ సింగ్, పీవీ నరసింహారావు ప్రభుత్వాలకు కూడా ఆయా రాష్ట్రపతులు నెల రోజుల సమయం ఇచ్చారు. ఇక అతి తక్కువగా ఐకే గుజ్రాల్ ప్రభుత్వానికి కేవలం రెండు రోజుల సమయమే ఇవ్వడం గమనార్హం. ఇక ప్రభుత్వాల బల నిరూపణల్లో కోర్టులు కూడా గడువులు విధించిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్యే గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచినా.. మిగిలిన చిన్న పార్టీలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు వెళ్లగా.. నాలుగు రోజుల్లోగా బలం నిరూపించుకోవాలని పారికర్ ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది.

ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్‌లాంటి రాష్ర్టాల్లో వెంటనే బల నిరూపణకు ఆదేశించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కర్ణాటక గవర్నర్ యడ్యూరప్ప ప్రభుత్వానికి 15 రోజుల గడువు ఇచ్చారు. ఆలోపు ఆయన తమకు సరిపడా సభ్యుల మద్దతు ఉందని అసెంబ్లీలో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్, జేడీఎస్‌కు తగిన సభ్యుల మద్దతు ఉన్నా.. గవర్నర్ బీజేపీని ఆహ్వానించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇచ్చిన గడువుపైనా వివాదం చెలరేగుతున్నది.

4861
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles