కుమారస్వామే కర్ణాటక సీఎం.. సోమవారమే ప్రమాణం!

Sat,May 19, 2018 08:07 PM

Governor has invited me to form government says JDS leader kumaraswamy

బెంగళూరు: మే 15 నుంచి కర్ణాటక రాజకీయాలు అనేక మలుపులు తిరిగాయి. చివరకు ఓ కొలిక్కి వచ్చాయి. అసెంబ్లీలో బలనిరూపణకు ముందే సీఎం పదవి నుంచి యడ్యూరప్ప తప్పుకోగా.. సీఎం పీఠం జేడీఎస్ నేత కుమారస్వామికి దక్కే అవకాశం వచ్చింది. దీంతో.. కుమారస్వామి ఇవాళ రాత్రి 7.30 కు రాజ్‌భవన్‌లో గవర్నర్ వాజూభాయ్‌ని కలిశారు. ఈసందర్భంగా గవర్నర్ కుమారస్వామిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. దీంతో వచ్చే సోమవారం కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని కంఠీరవ మైదానంలో మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట మధ్యలో ప్రమాణ స్వీకారం ఉంటుందని గవర్నర్ మీటింగ్ అనంతరం కుమారస్వామి మీడియాకు తెలిపారు.

రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం


సీఎంగా తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి దేశంలోని పలువురు నేతలను ఆహ్వానిస్తున్నట్లు కుమారస్వామి ప్రకటించారు. రాష్ట్ర సీఎం కే చంద్రశేఖర్‌రావు, వెస్ట్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించనున్నట్లు కుమారస్వామి మీడియాకు తెలిపారు. వాళ్లంతా తనను అభినందించారని ఆయన చెప్పారు. వాళ్లతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినట్లు ఆయన వెల్లడించారు.

ఇవాళ రాత్రే కాంగ్రెస్ నాయకులతో సమావేశం


ఇవాళ రాత్రి కాంగ్రెస్ నేతలతో సమావేశమై సంకీర్ణ ప్రభుత్వం సజావుగా సాగేందుకు అవసరమైన విధివిధానాలు రూపొందిస్తామని కుమారస్వామి స్పష్టం చేశారు. మంత్రి పదవులపై వాళ్లతో చర్చించి నిర్ణయిస్తామన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో న్యాయవ్యవస్థ పాత్రను అభినందిస్తున్నా అని ఆయన తెలిపారు. కేంద్రప్రభుత్వం ఈడీ, సీబీఐలను ఉపయోగించి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నదన్నారు. తాను ఏమాత్రం భయపడనని.. దేన్నయినా దైర్యంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.

3569
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles