బీటీ పత్తి విత్తనాల ధర తగ్గింపుTue,March 13, 2018 10:00 PM

బీటీ పత్తి విత్తనాల ధర తగ్గింపు

న్యూఢిల్లీ : పత్తి రైతులకు సంతోషకర వార్త. బీటీ కాటన్ (జన్యుమార్పిడి) విత్తనాల ధరను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్యాకెట్ బీటీ పత్తి విత్తనాల ధరను రూ.740 గా నిర్ణయించారు. గత ఏడాది ఈ విత్తనాల ధర రూ.800 గా ఉండగా, ఇప్పుడు రూ.60 మేర ప్రభుత్వం తగ్గించింది. మరోవైపు బీటీ పత్తి టెక్నాలజీని రూపొందించిన మోన్‌శాంటో మహికో కంపెనీకి దేశీయ విత్తన కంపెనీలు చెల్లించే రాయల్టీని కూడా ప్రభుత్వం రూ.49 నుంచి రూ.39 కి కత్తిరించింది.

ప్యాకెట్ గరిష్ఠ ధరలోనే రాయల్టీ కూడా కలిపి వుంటుందని కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 2018 ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే జూన్ నెల నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఒక్కో ప్యాకెట్లో 450 గ్రాముల బీటీ పత్తి విత్తనాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా 80 లక్షల మంది పత్తి రైతులకు ప్రయోజనం చేకూరనుంది. కాగా, బోల్‌గార్డ్ వర్షన్-1 విత్తనాలు యధావిధిగా రూ.635 ధర (రాయల్టీ లేకుండా)కు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 2016 నుంచి జీఎం వెర్షన్ విత్తనాలకు ఏకరీతి గరిష్ఠ ధరల్ని కేంద్రం స్థిరీకరిస్తున్నది.

అనుమతిలేని బీటీ విత్తన విక్రయాలపై దర్యాప్తు
దేశవ్యాప్తంగా అనుమతి పొందని బీటీ విత్తనాల విక్రయాలపై దర్యాప్తునకు కేంద్రం ఓ కమిటీని నియమించింది. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలో మూడవ రకం బీటీ కాటన్ పత్తి విత్తనాల అమ్మకాలు జరిగినట్లు కొన్ని కేసులు బయటకు వచ్చాయని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లిఖితపూర్వకంగా లోక్‌సభకు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరిపేందుకు శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ మండలి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటుచేసినట్లు మంత్రి షెకావత్ వెల్లడించారు

1348
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS