గవర్నర్ల భత్యాలపై కేంద్రం నూతన మార్గరద్శకాలు

Sun,June 3, 2018 08:56 PM

Government issues fresh guidelines on tour hospitality allowances of Governors

న్యూఢిల్లీ : జీతాలు పెంచిన నాలుగు నెలలకే గవర్నర్లకు ఇచ్చే వివిధ భత్యాలపై కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీచేసింది. పర్యటనలు, ఆతిథ్యం, వినోదం తదితర ఖర్చుల నిమిత్తం ఏటా ఈ భత్యాలను అందజేస్తున్నట్టు తెలిపింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం పశ్చిమ బెంగాల్ గవర్నర్ అందరికంటే ఎక్కువగా రూ.1.81 కోట్ల భత్యాన్ని అందుకోనున్నారు. దీంతోపాటు ఫర్నీచర్ కోసం రూ.80 లక్షలు, కోల్‌కతా, డార్జీలింగ్‌లో ఉన్న రెండు రాజ్‌భవన్ల నిర్వహణకు రూ.72.06 లక్షలు అందుకోనున్నారు. బెంగాల్ గవర్నర్ తర్వాత భత్యం అందుకునే విషయంలో తమిళనాడు గవర్నర్ రెండోస్థానంలో నిలిచారు. ఆయన భత్యం రూపంలో రూ.1.66 కోట్లు.. చెన్నై, ఊటీలో ఉన్న రాజ్‌భవన్లలో ఫర్నీచర్ కోసం రూ.7.50 లక్షలు, రెండు రాజ్‌భవన్ల నిర్వహణకు రూ.6.5 కోట్లు పొందనున్నారు.

బీహార్ గవర్నర్‌కు రూ.1.62 కోట్ల భత్యం.. పాట్నాలోని రాజ్‌భవన్ ఫర్నీచర్‌కు రూ.62 లక్షలు.. నిర్వహణకు రూ.80.2 లక్షలు అందజేయనున్నారు. మహారాష్ట్ర గవర్నర్ భత్యం కింద రూ.1.14 కోట్లు.. ఫర్నీచర్‌కు రూ.26.7 లక్షలు.. ముంబై, పుణె, నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్ల నిర్వహణకు రూ.1.8 కోట్లు అందుకోనున్నారు. కర్ణాటక గవర్నర్ భత్యం కింద రూ.1.05 కోట్లు.. ఫర్నీచర్ కోసం రూ.6.5 లక్షలు.. బెంగళూరు రాజ్‌భవన్ నిర్వహణకు రూ.38.2 లక్షలు పొందనున్నారు. రాజస్థాన్ గవర్నర్ భత్యం కింద రూ.93 లక్షలు.. ఫర్నీచర్ కోసం రూ.లక్ష.. జైపూర్, మౌంట్‌అబూలోని రాజ్‌భవన్ల నిర్వహణకు రూ.73.2 లక్షలు అందుకోనున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ భత్యం కింద రూ.66 లక్షలు, ఫర్నీచర్ కోసం రూ.10 లక్షలు, లక్నో రాజ్‌భవన్ నిర్వహణకు రూ.3.53 కోట్లు అందుకోనున్నారు. గుజరాత్ గవర్నర్ భత్యం కింద రూ.55 లక్షలు, ఫర్నీచర్ కోసం రూ.15 లక్షలు, గాంధీనగర్ రాజ్‌భవన్ నిర్వహణకు రూ.20 లక్షలు పొందనున్నారు. ఏపీ-తెలంగాణ రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ భత్యం కింద రూ.53 లక్షలు, ఫర్నీచర్ కోసం రూ.6 లక్షలు, హైదరాబాద్ రాజ్‌భవన్ నిర్వహణకు రూ.18.3 లక్షలు అందుకోనున్నారు. నాలుగేండ్ల తర్వాత గవర్నర్లకు ఇచ్చే భత్యాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించింది. నాలుగునెలల కిందట గవర్నర్ల వేతనాలను రూ.3.5 లక్షలకు పెంచుతూ కేంద్ర నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

3135
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles