మురికి కాలువలో పసికందు.. వీడియో

Thu,August 16, 2018 11:09 AM

Found Newborn Inside Drain In Chennai

చెన్నై : అప్పుడే పుట్టిన శిశువును మురికి కాలువలో పడేశారు. ఆ శిశువు ఏడుపులు విన్న ఓ మహిళ.. ఆ చిన్నారిని ప్రాణాలతో కాపాడింది. ఈ హృదయ విదారక సంఘటన చెన్నైలో నిన్న చోటు చేసుకుంది. వలసరవక్కమ్‌లో 45 ఏళ్ల గీత నివసిస్తుంది. ఉదయం 8 గంటల 45 నిమిషాల సమయంలో పాలు పోసే అబ్బాయి గీత ఇంటికి వచ్చాడు. దీంతో ఆమె తలుపులు తెరవగా.. ఇంటి ముందున్న మురికి కాలువలో శిశువు ఏడుపు వినిపించింది. తక్షణమే స్పందించిన గీత.. మురికి కాలువ వద్దకు చేరుకొని.. శిశువును బయటకు తీసింది. పసికందు మెడకు బొడ్డుతాడు అలానే చుట్టుకుంది. కొంచెం ఆలస్యమైనా శిశువు కన్నుమూసేది. చిన్నారిని తక్షణమే ఎగ్మూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పసికందు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. శిశువును అనాథ ఆశ్రమానికి తరలించనున్నట్లు వైద్యులు తెలిపారు.