ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి భార‌తర‌త్న ప్ర‌దానం

Thu,August 8, 2019 06:25 PM

Former President Pranab Mukherjee receives Bharat Ratna

న్యూఢిల్లీ: దేశ‌ అత్యున్న‌త పౌర పుర‌స్కారం భార‌త ర‌త్నను మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ అందుకున్నారు. రాష్ట్ర‌ప‌తి భవన్ లో 2019 సంవత్సరానికి గాను ముగ్గురు ప్రముఖులకు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు. ప్ర‌ణ‌బ్‌తో పాటు సరస్వతి శిశు మందిర్ వ్యవస్థాపకుడు దివంగ‌త శ్రీ నానాజీ దేశ్‌ముఖ్‌, సంగీత విద్వాంసుడు శ్రీ భూపేన్ హ‌జారికాకు ఈ ఏడాది జనవరిలో రాష్ర్టపతి రామ్‌నాథ్‌ భారతరత్న అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రణబ్ ముఖర్జీ, భూపేన్ హజారికా తరపున ఆయన కుమారుడు తేజ్ హజారికా, నానాజీ దేశ్‌ముఖ్ తరపున దీన్‌దయాళ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మన్ వీరేంద్రజిత్ సింగ్ భార‌తర‌త్న అవార్డుల‌ను రాష్ర్టపతి చేతుల మీదుగా అందుకున్నారు. భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వీవీ గిరి సరసన ప్రణబ్ ముఖర్జీ కూడా చేరారు.ప్రణబ్ ముఖర్జీ..
ప్రణబ్ ముఖర్జీ 1935 డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్‌లో జన్మించారు. ఎంఏ, ఎల్‌ఎల్‌బీ చదివారు. కలకత్తాలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో కొంతకాలం పాటు అప్పర్ డివిజన్ క్లర్క్‌గా పనిచేశారు. 1963లో లెక్చరర్‌గా పనిచేశారు. రాజకీయాల్లోకి రాకమునుపు జర్నలిస్టుగానూ విధులు నిర్వర్తించారు. 1969లో రాజకీయ అరంగేట్రం చేశారు. మిడ్నపూర్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి వీకే కృష్ణమీనన్ తరఫున ప్రచారం చేస్తూ నాటి ప్రధాని ఇందిరా గాంధీ దృష్టిలో పడ్డారు. ప్రణబ్‌ను పార్టీలోకి ఆహ్వానించిన ఇందిర... 1969 జూలైలో ఆయనను రాజ్యసభకు పంపించారు. 1973లో ఇందిర మంత్రివర్గంలో చేరారు. 1984లో ఇందిర హత్యానంతరం.. అనుభవం లేని రాజీవ్‌గాంధీ కంటే తానే ఇందిరకు అసలైన వారసుడినని ప్రణబ్ భావించారు. అయితే ప్రధాని పదవి రాజీవ్‌కు దక్కడంతో.. రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్ పేరిట ప్రణబ్ వేరే పార్టీ స్థాపించారు. 1989లో దిగివచ్చి తిరిగి కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 1991లో రాజీవ్‌గాంధీ హత్యానంతరం ప్రధాని పదవి చేపట్టిన పీవీ నరసింహారావు.. ప్రణబ్‌ముఖర్జీని ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా, 1995లో విదేశాంగ మంత్రిగా నియమించారు. 1998లో సోనియా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంలో ప్రణబ్ కీలకంగా వ్యవహరించారు. 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రణబ్ తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2012లో రాజీనామా చేసేవరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో నంబర్ 2గా ఉన్నారు. 2012-17 వరకు భారత రాష్ట్రపతిగా సేవలందించారు.

1342
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles