సిక్కుల ఊచకోత కేసులో తొలి ఉరిశిక్ష

Tue,November 20, 2018 05:00 PM

First Death Sentence In 1984 Anti Sikh Riots Case By Delhi Court

న్యూఢిల్లీ: 1984 సిక్కుల ఊచకోత కేసులో తొలిసారి ఓ దోషికి ఉరిశిక్ష విధించింది ఢిల్లీ కోర్టు. యశ్‌పాల్ సింగ్ అనే ఆ వ్యక్తికి ఉరిశిక్ష వేయగా.. నరేశ్ షెరావత్ అనే మరో వ్యక్తికి జీవితఖైదు విధించింది. ఇద్దరు సిక్కు వ్యక్తులను చంపిన కేసులో వీళ్లిద్దరూ దోషులుగా తేలారు. ఈ కేసు విచారణ జరిపిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఇద్దరు దోషులకు ఉరి శిక్ష వేయాలని కోర్టును కోరింది. వాళ్ల చర్య ఓ సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకొని సాగిన మారణహోమంలో భాగమని, ఇది అత్యంత అరుదైన కేసని సిట్ వాదించింది. దక్షిణ ఢిల్లీలో ఉండే మహిపాల్‌పూర్‌కు చెందిన హర్‌దేవ్ సింగ్, అవతార్ సింగ్ అనే వ్యక్తులను ఈ ఇద్దరూ హత్య చేశారు. 2015లో ఏర్పడిన సిట్ ఈ సిక్కుల ఊచకోత కేసును తిరిగి తెరిచిన తర్వాత తొలిసారి ఈ ఇద్దరు వ్యక్తులు దోషులుగా తేలారు.

నిజానికి 1994లో ఢిల్లీ పోలీసులు ఈ కేసును క్లోజ్ చేశారు. నిందితులు తమ చేతుల్లో కిరోసిన్, కర్రలు పట్టుకొని వెళ్లడం చూస్తే ఇది ప్రణాళిక ప్రకారం జరిగిన హత్యగా భావించాలని సిట్ తరఫున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురీందర్ మోహిత్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఇదొక్కటే ఘటన కాదు.. మొత్తం మూడు వేల మందిని హత్య చేశారని ఆయన కోర్టుకు చెప్పారు. వాళ్లకు కచ్చితంగా ఉరిశిక్ష విధించాలని వాదించినా.. నిందితుల తరఫున వాదించిన ఓపీ శర్మ వ్యతిరేకించారు. అది ప్రణాళిక ప్రకారం జరిగిన హత్య కాదని, సడెన్‌గా జరిగిన ఆందోళనల్లో అలా జరిగిపోయిందని ఆయన వాదించారు. ఓ దేశ ప్రధానిని ఓ సామాజికవర్గానికి చెందిన సొంత బాడీగార్డులే కాల్చి చంపారు. అంతకన్నా పెద్ద తప్పిదం మరేముంటుంది. ఆ హత్య తర్వాత జరిగిన ఆందోళనల్లో ఈ ఘటన జరిగింది తప్ప.. ప్రణాళిక ప్రకారం కాదని శర్మ కోర్టుకు తెలిపారు.

2329
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles