
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్లు ఎగొట్టిన బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యాకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహాయపడ్డారని బీజేపీ ఆరోపించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఆ పార్టీ ఆరోపణలు చేసింది. యూపీఏ ప్రభుత్వం మాల్యాకు రుణాలు ఇచ్చిందని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. రుణాలు ఇప్పించాలంటూ మాజీ ప్రధాని మన్మోహన్తో పాటు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరంకు మాల్యా లేఖ రాశారని, దాని తర్వాతే కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అధిపతికి రుణాలు ఇచ్చినట్లు బీజేపీ పేర్కొన్నది. రుణాలు ఇచ్చే ప్రక్రియను బ్యాంకులు వేగవంతం చేయాలంటూ మాజీ ప్రధానికి రాసిన లేఖలో మాల్యా కోరినట్లు తెలుస్తున్నది. ఈ లేఖలను 2011, 2013 సంవత్సరాల్లో రాశారు. మునిగిపోతున్న కాంగ్రెస్ పార్టీ, మరో మునిగిపోతున్న సంస్థ(కింగ్షిషర్)కు సాయం చేసిందని సంబిత్ పాత్ర విమర్శించారు. పాత రుణాలను చెల్లించకున్నా, మాల్యాకు మాత్రం పదే పదే రుణాలు ఇస్తూ వెళ్లారని ఆయన ఆరోపించారు. బ్యాంకులకు 9000 కోట్లు బాకీ ఉన్న మాల్యా గత మార్చిలో దేశం విడిచి వెళ్లారు. అతన్ని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.