
జైపూర్ : ఆమెకు మూడేళ్ల వయసున్నప్పుడే పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. పెరిగి పెద్దయ్యాక ఆ యువకుడితోనే వివాహం జరిపిస్తామని అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. నాటి ఒప్పందం.. ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చింది. రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన దివ్య చౌదరికి ఇప్పుడు 22 సంవత్సరాలు. అయితే ఈమెకు మూడేళ్ల వయసున్నప్పుడే.. పెళ్లి సంబంధం నిర్ణయించారు. పెద్దయ్యాక జీవరాజ్ అనే యువకుడితో వివాహం చేయాలని దివ్య తల్లిదండ్రులు నిశ్చయించారు. అయితే దివ్యకు ఇప్పుడు జీవరాజ్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తనకు తెలిసీ తెలియని వయసులో తన ప్రమేయం లేకుండా పెద్దలు నిశ్చయించిన ఈ పెళ్లిని చేసుకోవడం ఇష్టం లేదని పెద్దల సమక్షంలో దివ్య తేల్చిచెప్పింది. దీంతో పెద్దలు పంచాయితీ పెట్టి ఆమె కుటుంబానికి రూ. 16 లక్షలు జరిమానా విధించారు. ఈ డబ్బులను దివ్య.. జీవరాజ్ కుటుంబానికి ఇచ్చింది. రూ. 16 లక్షలు చెల్లించినప్పటికీ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో.. చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించింది దివ్య. పోలీసులకు ఫిర్యాదు చేస్తావా? అంటూ మరోసారి ఆమెకు రూ. 20 లక్షలు జరిమానా విధిస్తూ.. క్షమాపణలు చెప్పాలని పంచాయితీ తీర్పు ఇచ్చింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దివ్య.. పోలీసు స్టేషన్కు వెళ్లి పోలీసుల ముందే పాయిజన్ తాగేసింది. అప్రమత్తమైన పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.