రూ.40వేల కోట్లు.. అందుకే 'మహా' డ్రామా

Mon,December 2, 2019 03:50 PM

బెంగళూరు: బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఆయన వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతలు కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి సంపూర్ణ మెజార్టీ లేకపోయినప్పటికీ దేవేంద్ర ఫడణవీస్ నవంబర్ 23 ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 80 గంటల తర్వాత సీఎం పదవికి ఫడణవీస్ రాజీనామా చేశారు. అంత హడావుడిగా ఫడణవీస్ ప్రమాణం చేయడం వెనుకున్న ఆంతర్యాన్ని అనంత్ కుమార్ బయటపెట్టారు.


కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.40వేల కోట్లను కాపాడేందుకే మహా డ్రామా ఆడినట్లు అనంత్‌కుమార్ తెలిపారు.'మీ అందరికీ తెలుసు. మహారాష్ట్రలో మా పార్టీ నేత(ఫడణవీస్) కేవలం 80 గంటల పాటు సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత రాజీనామా చేశారు. ఈ డ్రామా ఎందుకు ఆడాల్సి వచ్చింది? మాకు తెలియదా? మెజార్టీ లేదని తెలిసినప్పటికీ అతడు సీఎం ఎందుకు అయ్యాడు?' అని అందరూ ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు.

'సుమారు రూ.40వేల కోట్లకు పైగా కేంద్ర నిధులు దుర్వినియోగం కాకుండా ఫడణవీస్ కాపాడారు. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి కోసం ఆ నిధులను ఉపయోగించరు. అవన్నీ పక్కదారి పడతాయి. ఇదంతా ముందే ప్లాన్ చేశాం. ఫడణవీస్ ప్రమాణం చేసిన 15 గంటల్లోపే ఆ నిధులను కేంద్రానికి తిప్పి పంపారు. పెద్ద డ్రామా నడపాలని ముందే భావించాం. అందుకే ప్రమాణస్వీకారం చేసి రాజీనామా చేయించాం. ఆ నిధులు ఇక్కడే ఉంటే తర్వాత వచ్చే సీఎం ఏం చేస్తారో మీకు తెలుసు కదా' అని అనంత్‌కుమార్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన ఫేస్‌బుక్ పేజీలో కూడా పోస్ట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని సిర్సిలో ఎంపీ అనంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

2178
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles