ఆన్‌లైన్ గేమ్‌కి అడిక్ట్ అయి తల్లిదండ్రులు, సోదరిని చంపేశాడు..!

Fri,October 12, 2018 07:35 PM

Delhi Teen Who Killed Family Was Addicted To An Online Game

ఢిల్లీలోని కిషన్‌గర్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఇద్దరు దంపతులు, వాళ్ల కూతురు హత్య జరిగింది తెలుసు కదా. ఆ హత్యల వెనుక అసలు సూత్రధారి వాళ్ల కొడుకు సూరజ్ అని కూడా తెలిసిందే. అయితే.. సూరజ్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అతడు సొంత పేరెంట్స్, సోదరిని ఎందుకు పొట్టన బెట్టుకున్నాడో పోలీసులకు తెలిపాడు.

న్యూఢిల్లీలోని మెహ్రౌలీలో సూరజ్ ఓ రూమ్‌ను రెంట్‌కు తీసుకున్నాడు. ఆయనతో పాటు 10 మంది ఫ్రెండ్స్ ఆ రూమ్‌లో ఉండేవారు. కాలేజీకి వెళ్లకుండా అదే రూమ్‌లో రోజూ గడిపేవారు. వాళ్లకు ఓ వాట్సప్ గ్రూప్ కూడా ఉంది. ఆ గ్రూప్‌లో ఎప్పుడూ క్లాసులు బంక్ కొట్టడం, తాగి తందనాలాడటం లాంటి వాటి గురించే ఎక్కువగా చర్చించేవారు. ఆ రూమ్‌లోనే ఆన్‌లైన్ గేమ్‌కు అడిక్ట్ అయ్యాడు సూరజ్. రోజు అదే గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేసేవాడు. అయితే.. చదువుపై ఏమాత్రం ఆసక్తి లేకుండా తిరుగుతున్న సూరజ్‌ను రెండుమూడు సార్లు తన తల్లిదండ్రులు మందలించారు. తన సోదరి తను బయట ఏం చేసినా పేరెంట్స్‌కు చెబుతుండటం.. పేరెంట్స్ ప్రతి విషయంలో అడ్డుతగులుతుండటంతో వాళ్లను చంపేయాలని పథకం పన్నాడు సూరజ్.

మంగళవారం రాత్రి తన ప్లాన్‌ను అమలు చేయాలనుకున్నాడు. ఆరోజు అంతా మామూలుగానే ఉన్నాడు. అర్ధరాత్రి వరకు ఫ్యామిలీతో గడిపాడు. ఫ్యామిలీ ఆల్బమ్ కూడా చూశాడు. అందరూ నిద్రకు ఉపక్రమించాక.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిద్ర లేచాడు. కిచెన్‌లోకి వెళ్లి కత్తి తీసుకున్నాడు. తల్లిదండ్రులు పడుకునే రూమ్‌కు వెళ్లాడు. ముందుగా తండ్రిని కత్తితో పలుమార్లు పొడిచాడు. దీంతో తీవ్రరక్త స్రావం అయి అతడి తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. అలికిడికి లేచిన తల్లిని కూడా పొడిచాడు. దీంతో తల్లి అచేతనురాలైంది. వెంటనే సోదరి రూమ్‌కు వెళ్లి.. సోదరి కడుపులో పొడిచాడు. ఇంతలో తన కూతురును రక్షించుకుందామని అక్కడికి వచ్చిన తన తల్లిని మళ్లీ పొడిచి చంపాడు. అనంతరం ఇంటినంతా గందరగోళంగా చేశాడు. వస్తువులన్నింటినీ చిందరవందర చేశాడు. ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పడం కోసం ఈ ప్లాన్ వేశాడు. ముగ్గురు చనిపోయారని నిర్ధారించుకున్నాక కత్తిని తన ఫింగర్ ప్రింట్స్ లేకుండా శుభ్రంగా కడిగి ఆ తర్వాత పొరుగింటి వాళ్లకు సమాచారం అందించాడు. దొంగలు వచ్చి పేరెంట్స్‌ను, సోదరిని చంపారని నమ్మబలికాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తుండగా... సూరజ్‌పై అనుమానం వచ్చి అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ఫ్యామిలీ బంధువులు, పోలీసులు అవాక్కయ్యారు. చనిపోయిన మిథ్‌లేశ్ వర్మ(45), అతడి భార్య సియా వర్మ(40), వాళ్ల కూతురు నేహ(16) అంత్యక్రియలను మిథ్‌లేశ్ సోదరుడు, ఇతర బంధువులే నిర్వహించారు. అంత్యక్రియలకైనా తనను వెళ్లనివ్వాలని సూరజ్ పోలీసులను వేడుకోలేదు. కానీ.. తనకు శిక్ష పడకుండా కాపాడాలంటూ పోలీసులను వేడుకోవడంతో పోలీసులు సూరజ్ వ్యక్తిత్వం చూసి ఆశ్చర్యపోయారు.

2792
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS