ఈ నెల 25 వరకు జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసుకునే అవకాశం

Mon,October 22, 2018 06:43 AM

Deadline for Filing September GST Returns Extended Till October 25

న్యూఢిల్లీ : గత నెలకుగాను జీఎస్టీఆర్-3బీ రిటర్నుల గడువును మరో ఐదు రోజులు పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఈ నెల 25 వరకు జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసుకునే అవకాశం వ్యాపారవేత్తలకు లభించినట్లు అయింది. జూలై 2017 నుంచి మార్చి 2018 మధ్యకాలంలో తమ వ్యాపారాలపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ) ప్రయోజనం పొందే వ్యాపారవేత్తలు ఈ గురువారం వరకు అనుమతినిచ్చింది. గతంలో ఈ గడువు ఈ నెల 20 వరకు మాత్రమే ఉండటంతో వ్యాపారవేత్తలు ఆందోళన వ్యక్తంచేయడంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ) ఈ నిర్ణయం తీసుకున్నది. గడిచిన నెలకుగాను జీఎస్టీఆర్-3బీ రిటర్నుల గడువును మరో ఐదు రోజులు పెంచుతున్నట్లు సీబీఐసీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఒకనెలకు సంబంధించి జీఎస్టీఆర్-3బీని ఆ తర్వాత నెల 20లోగా రిటర్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. విక్రయాలు, కొనుగోళ్లకు సంబంధించి రిటర్నుల సమాచారం ఆలస్యమవుతుండటంపై వ్యాపారవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారని, దీంతో గడువును మరో ఐదు రోజులు పొడిగించాల్సి వచ్చిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించాయి. మరోవైపు ఇటీవల జీఎస్టీ పరిధిలోకి వచ్చిన పన్ను చెల్లింపుదారులు తమ ఐటీసీ ప్రయోజనాన్ని పొందేందుకు డిసెంబర్ 31, 2018 వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అవకాశం కల్పించింది.

413
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS