సెక్స్ ప్రాథమిక హక్కు.. హార్దిక్ సిగ్గు పడాల్సిందేమీ లేదు!

Tue,November 14, 2017 01:26 PM

Dalit leader Jignesh Mewani backs Hardik Patel over sex CD

అహ్మదాబాద్: గుజరాత్ పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ హోటల్ రూమ్‌లో ఓ మహిళతో ఉన్న వీడియో సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీనిపై గుజరాత్‌కే చెందిన యువనేత జిగ్నేష్ మేవాని.. హార్దిక్‌కు మద్దతుగా ఓ ట్వీట్ చేశాడు. సెక్స్ అనేది ఓ ప్రాథమిక హక్కు అని, ఎవరికీ మీ ప్రైవసీని ఉల్లంఘించే హక్కు లేదంటూ చేసిన ఆ ట్వీట్ చర్చనీయాంశమైంది. మేవానీ ఓ దళిత నేత. ఈయన కూడా కాంగ్రెస్‌లో చేరకపోయినా.. ఎన్నికల్లో ఆ పార్టీకే మద్దతు తెలిపారు. గుజరాత్ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు బీజేపీని కాదని కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన హార్దిక్ పటేల్ వీడియో బయటకు రావడంతో ఆ రాష్ట్రంలోని చానెళ్లన్నీ దీనిని ప్రముఖంగా ప్రస్తావించాయి. సోమవారం నాడు రోజంతా ఈ వీడియో చానెళ్లలో హల్‌చల్ చేసింది. బీజేపీ కావాలనే తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ఈ వీడియోను రిలీజ్ చేసిందని హార్దిక్ ఆరోపించారు. ఈ ఏడాది మేలో తీసినట్లుగా ఉన్న ఈ వీడియో ఇప్పుడు బయటపడటం రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది.


ఇప్పుడు తాజాగా హార్దిక్‌కే చెందిన మరో వీడియో కూడా బయటకు వచ్చింది. హార్దిక్ తన స్నేహితులతో కలిసి మందు కొడుతున్న వీడియో అది. మద్య నిషేధం ఉన్న గుజరాత్‌లో హార్దిక్ మద్యం సేవించడం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది కూడా మే నెలలో పటీదార్ కమ్యూనిటీకి న్యాయం చేయాలంటూ హార్దిక్, అతని మద్దతుదారులు గుండ్లు కొట్టించుకొని 155 కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించిన సందర్భంలోనిదీ వీడియో కావడం గమనార్హం. అయితే ఈ వీడియోలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, ఇలాంటి చీప్ ట్రిక్స్‌కు తాము ఎప్పుడూ పాల్పడబోమని కేంద్ర మంత్రి మన్‌సుక్ మాండవీయ అన్నారు. అది ఫేక్ వీడియో అయినప్పుడు హార్దిక ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. గుజరాత్‌లో డిసెంబర్ 9, 14న రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఎన్నికల్లో ప్రముఖ పాత్ర పోషిస్తాడని భావిస్తున్న హార్దిక్‌కు సంబంధించిన వీడియోలు ఎంతమేరకు ప్రభావం చూపిస్తాయో చూడాలి.

6415
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS