అలా అయితే.. గోవా, బీహార్ మాకిచ్చేయండి!

Thu,May 17, 2018 06:32 PM

Congress demands Karnataka model in Goa Manipur Bihar and Meghalaya

న్యూఢిల్లీ: కర్ణాటక గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో బీజేపీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి కాంగ్రెస్, ఆర్జేడీ. అతిపెద్ద పార్టీ అంటూ కర్ణాటకలో బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ వాజుభాయ్ వాలా ఆహ్వానించిన విషయం తెలిసిందే కదా. ఇప్పుడు దీనినే ఉదాహరణగా చూపుతూ గోవా, బీహార్‌లలో అతిపెద్ద పార్టీగా నిలిచిన తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్, ఆర్జేడీ డిమాండ్ చేశాయి. ఆయా రాష్ర్టాల గవర్నర్లను తాము ఇదే కోరతామని స్పష్టంచేశాయి.

గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజార్టీ తమకు ఉన్నదని కాంగ్రెస్ అంటున్నది. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ 17 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం నాలుగు స్థానాల దూరంలో నిలిచింది. అయితే కేవలం 14 స్థానాలు గెలిచిన బీజేపీ గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గోవా గవర్నర్ మృదుల సిన్హా కూడా కర్ణాటక గవర్నర్ బాటలోనే నడవాలి.

గోవాలో అతిపెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి గతంలో ఆమె చేసిన తప్పును సరిదిద్దుకోవాలి అని గోవా కాంగ్రెస్ చీఫ చంద్రకాంత్ కవ్లేకర్ అన్నారు. 16 మంది పార్టీ ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్‌కు తాము లేఖ ఇస్తామని ఆయన చెప్పారు. ఇక సీఎం పారికర్ అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారని, రాష్ట్రంలో ప్రభుత్వమే లేదని కవ్లేకర్ అన్నారు. అటు మ‌ణిపూర్‌, మేఘాల‌యాల్లోనూ ఇదే ప‌ద్ధ‌తి అనుస‌రించాల‌ని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న‌ది.

అటు బీహార్‌లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా అతిపెద్ద పార్టీగా నిలిచిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. 2015 నవంబర్‌లో జరిగిన బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీకి 81 స్థానాలు వచ్చాయి. కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినందుకు నిరసనగా ఒక రోజు ధర్నా చేయాలని నిర్ణయించాం. అంతేకాదు బీహార్ ప్రభుత్వాన్ని రద్దు చేసి అతిపెద్ద పార్టీగా ఉన్న ఆర్జేడీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరుతున్నాం అని తేజస్వి యాదవ్ అన్నారు. 2015లో జేడీయూ, కాంగ్రెస్‌లతో కలిసి ఆర్జేడీ పోటీ చేసింది. ఆర్జేడీకే ఎక్కువ స్థానాలు వచ్చినా జేడీయూ నేత నితీష్‌కుమార్‌కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. అయితే 2017 జులైలో ఆర్జేడీని కాదని బీజేపీతో కలిశారు నితీష్‌కుమార్.

4052
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles