ఇన్నేళ్లకు తేల్చారు.. వాళ్లు వీరప్పన్ మనుషులు కాదట!

Tue,September 25, 2018 12:32 PM

Chennai court acquitted 9 accused in RaKumar abduction case

చెన్నై: ప్రముఖ కన్నడ నటుడు రాజ్‌కుమార్‌ను అప్పుడెప్పుడో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేసిన విషయం గుర్తుందా. ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తి.. కిడ్నాప్‌కు గురైన వ్యక్తి ఇద్దరూ ఎప్పుడో చనిపోయారు. కానీ ఆ కేసు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అప్పట్లో ఈ కిడ్నాప్ కేసును వీరప్పన్‌తోపాటు మరో 11 మందిపై నమోదు చేశారు. అందులో 9 మంది అసలు వీరప్పన్ మనుషులు కాదంటూ మంగళవారం తమిళనాడులోని ఓ కోర్టు తీర్పు చెప్పింది. వాళ్లంతా వీరప్పన్ మనుషులే అని చెప్పడానికి ప్రాసిక్యూషన్ ఓ చిన్న ఆధారాన్ని కూడా సంపాదించలేకపోయిందని అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి మణి అన్నారు. అంతేకాదు విచారణలో భాగంగా రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులు ఒక్కరు కూడా కోర్టు ముందు హాజరు కాలేదని కూడా ఈ సందర్భంగా జడ్జి స్పష్టంచేశారు.

రాజ్‌కుమార్‌ను 2000, జులై 30న వీరప్పన్ కిడ్నాప్ చేశాడు. అతడు తన కుటుంబంతో కలిసి దొడ్డ గజనూరులో ఉన్న ఫార్మ్‌హౌజ్‌లో ఉండగా.. వీరప్పన్ మనుషులు చుట్టుముట్టి కిడ్నాప్ చేశారు. సుమారు 108 రోజుల పాటు రాజ్‌కుమార్ వీరప్పన్‌తోపాటు అడవిలోనే ఉన్నాడు. చివరికి ఆ ఏడాది నవంబర్ 15న రాజ్‌కుమార్‌ను వీరప్పన్ విడుదల చేశాడు. దీనికి సంబంధించి వీరప్పన్‌తోపాటు 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో వీరప్పన్‌ను 2004, అక్టోబర్‌లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఓ ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. ఆ తర్వాత 2006లో రాజ్‌కుమార్ కూడా చనిపోయారు.

1563
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS