పండుగ బొనాంజా.. కార్లపై భారీ డిస్కౌంట్లు

Fri,October 19, 2018 03:13 PM

ముంబై: దసరా పండుగ పూట కొత్త కార్లు కొనేవాళ్ల కోసం మారుతి, హ్యుండాయ్, మహీంద్రాలాంటి కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. శుక్రవారం నుంచి ఈ డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చాయి. కంపెనీ, మోడల్‌ను బట్టి రూ.లక్షకుపైగా డిస్కౌంట్లతోపాటు క్యాష్ బ్యాక్, ఎక్స్‌చేంజ్ బోనస్, ఇతర అన్ని లాభాలు కలుపుకొని అత్యధికంగా రూ.9.5 లక్షల వరకు డిస్కౌంట్ లభించనుంది. మారుతీ సుజుకీకి చెందిన వేగన్ ఆర్, సెలెరియోతోపాటు హ్యుండాయ్ గ్రాండ్ ఐ10లాంటి కార్లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఏ కారుపై ఎంత డిస్కౌంట్ ఉందో ఒకసారి చూద్దాం. నగరాన్ని బట్టి ఈ డిస్కౌంట్లలో కాస్త తేడాలు ఉండే అవకాశం ఉంది.

మహీంద్రా రెక్స్‌టన్ (డిస్కౌంట్ రూ.9.5 లక్షల వరకు)


మహీంద్రా వచ్చే నెల 19న వై400 పేరుతో ఓ ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. దానికి ముందు ప్రస్తుతం ఉన్న రెక్స్‌టన్ కార్లపై భారీగా డిస్కౌంట్ ప్రకటించింది. డిస్కౌంట్, నగదు లబ్ధి, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు అన్నీ కలుపుకొని రూ.9.5 లక్షల వరకు డిస్కౌంట్ లభించనుండగా.. ఈ కారు ధర రూ.20 లక్షలకు చేరనుంది.

మారుతి సుజుకి వేగన్ ఆర్ (డిస్కౌంట్ రూ.1.85 లక్షల వరకు)


ఇండియాలోని టాప్ సెల్లింగ్ కార్లలో ఒకటైన వేగన్ ఆర్‌పై కూడా ఈ పండుగ సీజన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్ ఊరిస్తున్నది. కొందరు డీలర్లు అత్యధికంగా రూ.1.85 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్‌లో నగదు లబ్ధితోపాటు ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా కలిపి ఉంటాయి. వచ్చే ఏడాది ఇండియాలో కొత్త వేగన్ ఆర్ మోడల్ అందుబాటులోకి రానుంది.

హోండా సీఆర్-వీ ప్రి-ఫేస్‌లిఫ్ట్ (డిస్కౌంట్ రూ.1.5 లక్షల వరకు)


హోండా సీఆర్-వీ ప్రి ఫేస్‌లిఫ్ట్ మోడల్ స్టాక్‌ను సాధ్యమైనంత త్వరగా అమ్మేయాలని భావిస్తున్న ఆ సంస్థ.. రూ.1.5 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నది. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ బోనస్, ఇన్సూరెన్స్‌లాంటి ఎన్నో లాభాలు ఇందులో ఉన్నాయి. హోండా సీఆర్-వీ మంచి ఎస్‌యూవీ మోడల్ అయినా.. ఈ మధ్య కాలంలో కాస్త గిరాకీ తగ్గింది.

హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 (డిస్కౌంట్ రూ.1.35 లక్షల వరకు)


మారుతి సుజుకి స్విఫ్ట్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 మోడల్‌పై ఆ సంస్థ రూ.1.35 లక్షల వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. నగదు లబ్ధి, ఎక్స్‌చేంజ్ బోనస్ ఇందులో ఉంటాయి. అంతేకాదు సెడాన్ మోడల్ అయిన హ్యాండాయ్ ఎక్సెంట్‌పై రూ.లక్ష వరకు డిస్కౌంట్ ప్రకటించింది.

మారుతి సుజుకి సెలెరియో (డిస్కౌంట్ రూ.1.35 లక్షల వరకు)


మారుతి సుజుకి కార్లకు మంచి డిమాండ్ ఉన్నా.. ఈ సెలెరియో మాత్రం కస్టమర్లను అంతగా ఆకట్టుకోలేదు. మొదటి నుంచీ దీని సేల్స్ తక్కువగానే ఉన్నాయి. దీంతో చాలా మంది డీలర్లు ఈ కారుపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. ఇది రూ.1.35 లక్షల వరకు ఉంది.

2655
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles