ఆ పులిని సజీవంగా పట్టుకోవడం సాధ్యం కాదట

Fri,September 21, 2018 07:11 PM

CANT CAPTURE THE MAN-EATER TIGER ALIVE SAYS SHARP-SHOOTER

మహారాష్ట్రలోని యవత్‌మాళ్ జిల్లా పాంఢర్‌కావడా డివిజన్‌లో ప్రస్తుతం ఓ పులి దడ పుట్టిస్తున్నది. అది నరమాంసం రుచిమరిగిన పులికావడంతో చిక్కొచ్చింది. పైగా అది ఆడపులి. దానికి రెండు పిల్లలున్నాయి. ఆ పులి వ్యవహారం సుప్రీంకోర్టు దాకా పోయింది. సర్వోన్నత న్యాయస్థానం పులిని చంపేందుకు అనుమతించింది. అయితే పిల్లల్ని కాపాడాలని తెలిపింది. ఈ క్లిష్టమైన కార్యాన్ని నెరవేర్చేందుకు హైదరాబాద్ నుంచి షార్ప్ షూటర్ నవాబ్ షఫాత్ అలీఖాన్‌ను పిలిపించారు. ఆయన రాకను జంతు సంరక్షణ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. వాటిని చంపకుండా పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఇది సాధ్యం కాకపోవచ్చని ఖాన్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు.

పులి, దాని రెండుపిల్లలు పగలు పొదల్లో దాక్కుంటున్నాయి. పులులకు రాత్రి సంచారం ఎక్కువ. అందుకే అవి రాత్రి పొదల్లోనుంచి బైటకు వచ్చి వేట మొదలుపెడతాయి. గత కొన్ని నెలలుగా అటవీ విభాగం వాటిని పట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నించాయి. దీనివల్ల సమయం వృధా అయింది కానీ ఫలితం దక్కలేదు. ఇప్పుడు ఖాన్ రంగంలోకి దిగారు. ఆయన కుడా నిబంధనల ప్రకారం సాయంత్రం నుంచి ఉదయం వరకు పులులపై మత్తు తూటాలు పేల్చడానికి వీల్లేదు. పగలు పులులు బైటకి రావు. ఓవైపు పంటలు కోతకు వస్తున్నాయి. ఊళ్లు, పొలాలు, అడవులు కలగాపులగంగా ఉన్నాయి. తెల్లవారు జామున మూడింటికే జనం పొలాలకు వెళ్తున్నారు. ఇలా చూస్తే పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని ఖాన్ చెప్పారు. ఎప్పుడు ఎవరిమీద దాడి జరుగుతుందో చెప్పలేమని అంటున్నారు. పులికి మనుషుల్ని చంపడమే కాకుండా నరమాంస భక్షణ అలవాటైంది. దాని పిల్లలకూ అంతే. తనకు పులులను చంపడమంటే సరదా అన్నట్టుగా కొందరు మాట్లాడడాన్ని ఖాన్ ఖండించారు. బ్రహ్మపురిలో 2017 జూలైలో షూటింగ్ ఆర్డరు ఉన్నప్పటికీ ఓ ఆడపులిని సజీవంగా పట్టుకున్నానని చెప్పారు. మరికొన్ని పులుల్ని బోన్లలో సజీవంగా పట్టుకున్నానని వివరించారు. పాంఢర్‌కావడాలో మాత్రం అది సాధ్యం కాదని తేల్చేశారు.

వసంతకాలం అయిపోవడం, వర్షాలు పడడంతో పొదలు దట్టంగా పెరగడం ఇప్పుడు అసలు సమస్య. 14వ తేదీ పులి ఖాన్ మీదకు ఉరికివచ్చింది. ఆయన తుపాకీ ఎక్కుపెట్టేలోగానే ఇది పొదల్లోకి తిరిగి మాయమైంది. 19వ ఏట నుంచే ఈ వృత్తిలో ఉన్న ఖాన్‌కు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. పాంఢర్‌కావడా తరహా సమస్యలు ఎదురైతే ఆయననే పిలిపిస్తారు. ప్రస్తుతం స్థానిక మీడియాలో ఖాన్‌కు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయి. కానీ గత 40 ఏళ్లల్లో ఇలాంటివి చాలా చూశానని ఆయన కొట్టిపారేశారు. మొహరం పండుగకు ఖాన్ హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆయన తిరిగి వచ్చేవరకు మహారాష్ట్ర అటవీ విభాగం వారు పులివేటను కొనసాగించాల్సి ఉంటుంది.

10435
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS