వైమానిక దాడులు.. బీజేపీకి 22 సీట్లు : యడ్యూరప్ప

Thu,February 28, 2019 04:42 PM

బెంగళూరు : కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. కర్ణాటకలోని చిత్రదుర్గలో నిన్న నిర్వహించిన సమావేశంలో యడ్యూరప్ప మాట్లాడారు. జైషే ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం దాడులు చేయడం వల్ల బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నాయని.. దీంతో కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలకు గానూ 22 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందన్నారాయన. ఈ వ్యాఖ్యలపై విపక్ష పార్టీల నేతల నుంచే కాకుండా సొంత పార్టీ నేతలు కూడా తప్పుబట్టడంతో.. తన వ్యాఖ్యలను వక్రీకరించారని యడ్యూరప్ప పేర్కొన్నారు. బీజేపీకి 22 సీట్లు వస్తాయని గత కొంత కాలం నుంచి చెబుతూనే ఉన్నానని, ప్రస్తుత పరిణామాలకు తన వ్యాఖ్యలను ముడిపెట్టడం సరికాదన్నారు యడ్యూరప్ప. ఉగ్రవాద శిబిరాలపై భారత దాడులతో ప్రధాని మోదీకి అనుకూలంగా పవనాలు వీస్తున్నాయని.. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయానికి ఈ దాడులు ఉపయోగపడుతాయన్నారు. దాడుల అనంతరం యువత సెలబ్రేషన్స్‌ చేసుకుంటుందని యడ్యూరప్ప అన్నారు.


యడ్యూరప్ప వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం కుమారస్వామి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చి ఉగ్రవాదంపై పోరాడుతున్న ఇండియన్‌ ఆర్మీని, కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తుంటే.. యడ్యూరప్ప మాత్రం లోక్‌సభ ఎన్నికల్లో ఎన్ని అదనపు సీట్లు గెలుచుకుంటామనే అంశంపై బీజీగా ఉన్నారని కుమారస్వామి మండిపడ్డారు. ఉగ్రవాదులపైన దాడులు, పాకిస్థాన్‌తో యుద్ధం ఆ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు తీసుకువస్తాయి అని చెప్పడం సిగ్గుచేటు అని కుమారస్వామి పేర్కొన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం సైనికుల త్యాగాల్ని బలి చేయడం సిగ్గు చేటని కర్ణాటక సీఎం మండిపడ్డారు.

1920
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles