నక్సల్స్ అటాక్.. 9 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతిTue,March 13, 2018 02:54 PM

నక్సల్స్ అటాక్.. 9 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి

బస్తర్: చత్తీస్‌ఘడ్‌లో బాంబు పేలిన ఘటనలో 9 మంది సీఆర్‌పీఎప్ జవాన్లు మృతిచెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. సుక్మా జిల్లాలో ఈ దాడి జరిగింది. సుక్మాలోని కిస్టారమ్-పేలోడి రోడ్‌లో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకున్నది. మావోలతో జరిగిన ఎదురుకాల్పుల తర్వాత ఇవాళ ఉదయం భద్రతా బలగాలు సుక్మా ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించాయి. ఆ సమయంలో బాంబులు పేలడంతో సీఆర్‌పీఎప్ జవాన్లు మృతిచెందారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో నక్సల్స్ ఎన్‌కౌంటర్ జరిపారు. ఆ తర్వాత వాళ్లు పారిపోయారు. వారి కోసం జవాన్లు కూంబింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 నిమిషాల సమయంలో మరో సీఆర్‌పీఎఫ్ టీమ్‌ను నక్సల్స్ టార్గెట్ చేశాయి. ఐఈడీని పేల్చడంతో ఎంపీవీ పేలినట్లు తెలుస్తున్నది.
ఎంపీవీని పేల్చేశారు..
మైన్ ప్రొటెక్టెడ్ వెహికిల్‌.. దీన్ని ఎంపీవీ అంటారు. కూంబింగ్ కోసం ఈ వాహనాలను ప్రత్యేక బలగాలు వాడుతుంటాయి. ఒకవేళ నక్సల్స్ దాడి చేసినా.. ఆ వాహనంలో ఉన్నవారికి ఏమీకాదు. కానీ ఇవాళ సుక్మా జిల్లాలో జరిగిన దాడిలో ఏకంగా ఎంపీవీ వాహనాన్ని మందుపాతరతో పేల్చేశారు. చత్తీస్‌ఘడ్‌లో ఇవాళ జరిగిన పేలుడు ఘటనపై యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ యూనిట్ డీఐజీ అవాస్తీ మాట్లాడారు. ఎంపీవీ వాహనం పేలుడు వల్ల మరింత మంది జవాన్లు మృతిచెంది ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నక్సల్స్‌తో జరిగిన ఫైరింగ్ నిలిచిపోయిందన్నారు. సుక్మా జిల్లాకు తక్షణమే అదనపు బలగాలను పంపించినట్లు ఆయన చెప్పారు. ఆ జిల్లా ఎస్పీ కూడా స్పాట్‌కు చేరుకున్నారు. సీఆర్‌పీఫ్ 208 కోబ్రా బాటాలియన్, మావోల మధ్య ఇవాళ ఉదయం 8 గంటలకు ఎన్‌కౌంటర్ జరిగినట్లు సీఆర్‌పీఎఫ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. మొదట కోబ్రా జవాన్ల దూకుడును చూసి మావోలు పారిపోయారు. కానీ మధ్యాహ్నం 12.30 నిమిషాలకు సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 212 బెటాలియన్‌పై మావోలు దాడి చేశారు. ఎంపీవీ వాహనంలో కిస్టారమ్ పలోడి రోడ్డు మీద వెళ్తున్న ఆ బెటాలియన్‌ను నక్సల్స్ పేల్చేశారు. ఐఈడీని పేల్చడంతో జవాన్ల వాహనం చెల్లాచెదురై పడిపోయింది. గాయపడ్డ జవాన్లను హెలికాప్టర్ ద్వారా హాస్పటల్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నక్సల్స్ దాడి చాలా దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దేశం కోసం పోరాడుతూ ప్రాణాలర్పించిన ప్రతి జవానకు వందనాలర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

2178
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS