ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు.. మంత్రి ప‌ద‌వి!

Wed,May 16, 2018 12:49 PM

BJP offering 100 crores to each MLA reveals Kumaraswamy

బెంగళూరు: కర్ణాటక జేడీఎస్ నేత కుమారస్వామి సంచలన విషయాలు వెల్లడించారు. ఎలాగైనా అధికారంలోకి రావడానికి చూస్తున్న బీజేపీ తమ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి రూ.వంద కోట్లు, మంత్రి పదవి ఇవ్వజూపిందని ఆరోపించారు. ఈ బ్లాక్ మనీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఎక్కడ అంటూ ఆయన ప్రశ్నించారు. తన ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ దగ్గర కోట్ల కొద్దీ డబ్బు ఉందని, అదంతా బ్లాక్‌మనీయా లేక వైట్ మనీయా అని కుమారస్వామి నిలదీశారు. నల్లధనంపై పోరు అంటూనే ప్రధాని మోదీ తన ఎమ్మెల్యేలను అదే బ్లాక్‌మనీతో కొంటున్నారని విమర్శించారు. బీజేపీ ఉత్తర భారతంలో అశ్వమేథ యాత్ర మొదలుపెట్టింది. ప్రస్తుతం గుర్రాలు కర్ణాటకలో ఉన్నాయి. ఇక్కడితో బీజేపీ అశ్వమేధ యాత్ర ముగుస్తుంది అని కుమారస్వామి అన్నారు. తానే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానన్న యడ్యూరప్ప వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ముందు మీ మెజార్టీ ఎంతో చూసుకోండి అని చెప్పారు.


ఆప‌రేష‌న్ క‌మ‌ల్ పేరుతో ఎమ్మెల్యేల‌ను లాగే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ ఆప‌రేష‌న్‌ను మ‌ర‌చిపోండి. మీరు మా ఎమ్మెల్యేల‌ను లాగితే మేమూ అదే చేస్తాం. మీకంటే రెట్టింపు ఎమ్మెల్యేల‌ను మీ క్యాంప్ నుంచి లాగుతాం. మాతో రావ‌డానికి ఎంతో మంది బీజేపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు అని కుమార‌స్వామి చెప్పారు. బీజేపీ క‌ర్ణాట‌క ఇన్‌చార్జ్ ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్‌ను క‌లిశారా అని ప్ర‌శ్నించ‌గా.. జ‌వ‌దేక‌ర్ ఎవ‌రు.. ఎవ‌రా పెద్ద‌మ‌నిషి అని కుమార‌స్వామి అన‌డం గ‌మ‌నార్హం. కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీని కాదని జేడీఎస్‌కు కాంగ్రెస్‌కు మద్దతు తెలపడంతో రాజకీయం రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. ఈ ప్రయత్నాలు అడ్డుకోవడానికి కుమారస్వామి అన్న, దేవెగౌడ పెద్ద కొడుకు రేవణ్నను మచ్చిక చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుమారస్వామి ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. అధికారం కోసం తెర వెనుక పెద్ద డ్రామానే నడుస్తున్నట్లు స్పష్టమవుతున్నది. మరోవైపు జేడీఎస్, బీజేపీ శాసనసభ పక్షాలు ఇవాళ సమావేశమై తమ నేతలుగా కుమారస్వామి, యడ్యూరప్పలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి.

6353
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles