29 రాష్ట్రాల్లో 19 బీజేపీ చేతుల్లోనే..

Mon,December 18, 2017 02:19 PM

BJP is now ruling 19 states in India with wins in Gujarat and Himachal Pradesh

న్యూఢిల్లీః దేశంలో బీజేపీ బలం రోజురోజుకూ పెరుగుతున్నది. తాజాగా గుజరాత్‌ను వరుసగా ఆరోసారి నిలబెట్టుకోవడంతోపాటు.. అటు హిమాచల్‌ప్రదేశ్‌ను కాంగ్రెస్ నుంచి లాక్కున్నది. దీంతో ప్రస్తుతం ఉన్న 29 రాష్ట్రాల్లో 19 బీజేపీ పాలనలోనే ఉన్నాయి. ఇది ఓ రికార్డు. గతంలో ఏ పార్టీ కూడా ఒకేసారి ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో లేదు. 24 ఏళ్ల కిందట కాంగ్రెస్ అత్యధికంగా 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. 1993లో మొత్తం 26 రాష్ట్రాల్లో 15 కాంగ్రెస్ చేతుల్లోనే ఉండేవి. ఒకటి సంకీర్ణ ప్రభుత్వం కాగా.. మరో రెండు కాంగ్రెస్‌కు బయటి నుంచి మద్దతు తెలిపిన సీపీఎం ప్రభుత్వాలు. మళ్లీ ఇన్నాళ్లకు 19 రాష్ట్రాల్లో నేరుగా బీజేపీ లేదా ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్నాయి. 2014లో కేంద్రంలో మోదీ ప్రభంజనం తర్వాత బీజేపీ బలం అసాధారణంగా పెరిగిపోయింది. సార్వత్రిక ఎన్నికల తర్వాతే బీజేపీ కీలక రాష్ట్రాల్లో పాగా వేయగలిగింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ కేవలం ఐదు రాష్ట్రాల్లో (గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, నాగాలాండ్)నే అధికారంలో ఉండేది. 2014 ఎన్నిలతోపాటే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ ఇటు ఆంధ్రప్రదేశ్‌లో, సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ అటు సిక్కింలో అధికారంలోకి వచ్చాయి.

ఆ తర్వాత మహారాష్ట్రలో శివసేన సాయంతో అధికారంలోకి రాగా.. అదే సమయంలో హర్యానాలోనూ పాగా వేసింది. ఆ వెంటనే జార్ఖండ్ కూడా కాషాయాన్ని సంతరించుకుంది. 2014లోనే జరిగిన జమ్ముకశ్మీర్ ఎన్నికల్లోనూ బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అక్కడి పీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 2015లో బీహార్, ఢిల్లీ ఎన్నికల్లో ఓటమే మోదీకి మింగుడు పడలేదు. అయితే అక్కడ ఆర్జేడీతో కలిసి జేడీయూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండేళ్లలోనే నితీశ్ కుమార్ మళ్లీ బీజేపీవైపు మొగ్గు చూపిన విషయం తెలిసిందే. 2016లో 15 ఏళ్ల‌ కాంగ్రెస్ పాలనకు ఫుల్‌స్టాప్ పెట్టి అస్సాంను కైవసం చేసుకుంది. అదే ఏడాది అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న 47 మంది ఎమ్మెల్యేలూ బీజేపీలో చేరి కాషాయ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడుల్లో మాత్రం ప్రాంతీయ పార్టీల హవాలో బీజేపీ కొట్టుకుపోయింది.

ఇక ఈ ఏడాది అసలు సక్సెస్ సాధించింది బీజేపీ. మొత్తం ఆరు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ను క్లీన్‌స్వీప్ చేయడం విశేషం. యూపీతోపాటు ఉత్తరాఖండ్‌లోనూ బంపర్ మెజార్టీతో గెలిచింది. గోవా, మణిపూర్‌లలో కాంగ్రెస్ కన్నా తక్కువ స్థానాల్లో గెలిచినా.. స్థానిక పార్టీల మద్దతు కూడగట్టి ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. పంజాబ్‌లో మాత్రం ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. ఇప్పుడు తాజాగా గుజరాత్‌లో వరుసగా ఆరోసారి పాగా వేయగా.. కాంగ్రెస్ చేతిలో ఉన్న హిమాచల్‌ను కూడా చేజిక్కించుకున్నది. వచ్చే ఏడాది కర్ణాటక, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లతోపాటు ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరంలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ప్రభుత్వాలు ఉండగా.. మరో పెద్ద రాష్ట్రమైన కర్ణాటక లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్నది. కాంగ్రెస్ లేని భారత్ అంటూ మోదీ చేస్తున్న ప్రచార లక్ష్యాన్ని బీజేపీ మెల్లమెల్లగా సాధిస్తున్నది.

11372
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles