ఆ ఎమ్మెల్యేలే బీజేపీ టార్గెట్!

Thu,May 17, 2018 01:42 PM

BJP eyeing Lingayat MLAs in Congress and JDS to form government

బెంగళూరు: కర్ణాటక రాజకీయం రంజుగా మారింది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడంతో అసలు కథ ఇప్పుడు మొదలు కానుంది. గవర్నర్ బల నిరూపణ కోసం 15 రోజుల సమయం ఇచ్చారు. నిజానికి యడ్యూరప్ప అడిగింది వారం రోజులే అయినా.. గవర్నర్ 15 రోజులు ఇవ్వడంపైనా ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఎమ్మెల్యేలతో బేరసారాలు మొదలయ్యాయి. బీజేపీ ముందు ఇప్పుడు రెండు దారులు ఉన్నాయి.

ఒకటి తమకు తక్కువగా ఉన్న 8 మంది ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్ లేదా జేడీఎస్‌ల వైపు చూడటం.. లేదంటే బల నిరూపణ సమయానికి ఆ రెండు పార్టీల నుంచి పలువురు ఎమ్మెల్యేలు అసలు సభకు హాజరు కాకుండా చేయడం. రెండో దారిలో వెళ్తే సభలో ఎమ్మెల్యేల సంఖ్య తగ్గి బీజేపీ ఇప్పుడున్న సంఖ్యతోనే బల నిరూపణ చేసుకోగలుగుతుంది. మొదటి దారిలో వెళ్లాలంటే మాత్రం కనీసం మరో 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి అవసరమవుతారు.

దీనికోసం కాంగ్రెస్‌లోని లింగాయత్ ఎమ్మెల్యేల వైపు బీజేపీ చూస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్ కూటమిలో పది మందికిపైగా లింగాయత్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వొక్కలిగ అయిన కుమారస్వామి సీఎం కావడం వీళ్లకు ఇష్టం లేదు. దీంతో లింగాయత్ కమ్యూనిటీలో పెద్ద నేతగా ఉన్న యడ్యూరప్ప వైపు వీళ్లు చూసే అవకాశం ఉంది. ఇక లింగాయత్‌లకు ప్రత్యేక మతం, మైనార్టీ హోదా ఇవ్వాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను కూడా వీళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు.

దీంతో వీళ్లంతా బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కర్ణాటకలో లింగాయత్‌లు, వొక్కలిగాల మధ్య ఎన్నాళ్లుగానో రాజకీయ వైరం ఉంది. 2007లో ఒప్పందం ప్రకారం సీఎం పీఠాన్ని బీజేపీకి ఇవ్వాల్సిన కుమారస్వామి దానికి అంగీకరించకపోవడం వీళ్ల మధ్య వైరాన్ని మరింత ముదిరేలా చేసింది. ఇప్పుడిదే పాయింట్‌ను ఆసరాగా చేసుకొని కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల వేటలో బీజేపీ ఉంది. మరి ఆ పార్టీ ఎంత వరకు సక్సెసవుతుందో చూడాలి.

4650
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles